రైల్లో.. చలో

10 Jul, 2016 01:24 IST|Sakshi
రైల్లో.. చలో

ఐఆర్‌సీటీసీలో స్టూడెంట్ స్పెషల్ టూర్స్
పర్యాటక సంస్థతో కలిసి ప్యాకేజీలు
త్వరలో  ప్రారంభం

 సాక్షి, హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ ప్యాకేజీలు, విమాన సర్వీసులను పర్యాటకులకు అందుబాటులోకి  తెచ్చిన  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా స్టూడెంట్ స్పెషల్  టూర్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల విజ్ఞాన, విహార యాత్రల అభిరుచికి అనుగుణంగా త్వరలో ఈ ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ప్రధాన పర్యాటక ప్రాంతాలతో  పాటు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని  వివిధ ప్రాంతాల్లో  పర్యటించేందుకు  ఈ ప్యాకేజీలను  అందుబాటులోకి తెస్తారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలకు రైలు మార్గంలో స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బోగీలను  ఏర్పాటు చేస్తారు.

ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని మారు మూల  ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, ఇతర ప్రాంతాలను పరిచయం చేసే లక్ష్యంతో స్టూడెంట్స్ స్పెషల్ టూరిస్టు ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. విద్యార్థులకు రవాణా, భోజనం, వసతి,గైడ్,  తదితర అన్ని సదుపాయాలతో  తక్కువ చార్జీల్లోనే  ఈ ప్యాకేజీలు  ఉంటాయి. మరో వారం, పది రోజుల్లో ఈ తరహా పర్యాటక ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ  వెలువరించనుంది. మరోవైపు విద్యార్థులకు అవసరమైన  వసతి, తదితర ఏర్పాట్ల కోసం  రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో కలిసి ఈ  ప్యాకేజీలను  అందుబాటులోకి తేనున్నారు.

విద్యార్థుల భద్రత ప్రధానం..
ప్రస్తుతం  దసరా, సంక్రాంతి వంటి సెలవు రోజుల్లో విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లేందుకు  విద్యాసంస్థలు ప్రైవేట్ పర్యాటక సంస్థలపై ఆధారపడి వెళ్లవలసి వస్తోంది. ఈ పర్యటనల్లో విద్యార్ధులకు కానీ, కొన్ని పర్యాటక సంస్థలకు  కానీ  ఆయా ప్రాంతా ల భౌగోళిక పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం,అనుభవం ఉన్న గైడ్స్ లభించకపోవడం వంటి కారణాల దృష్ట్యా  పిల్లలను టూర్లకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బియాస్ నది దుర్ఘటన అనంతరం  టూర్ల పట్ల  అందరిలోనూ అభద్రతా భావం నెలకొంది. విద్యాసంస్థలు సైతం రిస్క్ తీసుకొనేందుకు వె నుకడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో  పర్యాటక రంగం పట్ల అపారమైన అనుభవం ఉన్న కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీలపై దృష్టి సారించింది.

 పర్యాటకాభివృద్ధి సంస్థతో సమన్వయం..
విద్యార్థులకు అవసరమైన రాష్ట్రస్థాయి  ప్యాకేజీలు, పర్యాటక ప్రాంతాల ఎంపిక, వసతి, తదితర అంశాలపై  ఐఆర్‌సీటీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ప్యాకేజీల రూపకల్పనపై ఒకరి నుంచి ఒకరికి లభించవలసిన సహాయ సహకారాలపైన చర్చించారు.  సమన్వయంతోనే ఇది విజయవంతం కాగలదని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి  ఒకరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు