అమ్మో... అమ్మాయిలు!

8 Aug, 2016 10:05 IST|Sakshi
అమ్మో... అమ్మాయిలు!
  • ప్రమాదకరంగా బైక్ రేసులు
  • అదుపు తప్పుతున్న వినోదం
  • బీచ్ రోడ్డులో విహారం

  •  
    విశాఖలో కొత్త సంస్కృతికి తెరలేస్తోంది. స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో యువతుల ధోరణిలో మార్పు వస్తోంది. ఇన్నాళ్లూ యువకులు, విద్యార్థులకే పరిమితమైన బైక్ రేసింగ్ తాజాగా విద్యార్థినులు, యువతులకు ఫ్యాషన్‌గా మారింది. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినా ఇప్పుడిప్పుడే మన మహానగరంలో ఈ నూతన విష సంస్కృతి ప్రబలుతోంది.
     
     విశాఖపట్నం : బైక్, కారు రేసింగ్‌తో కొంతమంది యువతరం ఆనందం పొందుతుంది. సంపన్న వర్గాల పిల్లలకు ఇలాంటి వాటిపై మోజు అధికంగా ఉంటుంది. పేద, మధ్య తరగతి వారి పిల్లలకు అలాంటి సరదా ఉన్నా తీరే పరిస్థితి ఉండదు. అందువల్ల అలాంటి కోరికలను ఆదిలోనే తుంచేసుకుంటారు. అయితే విశాఖ నగరంలో స్థితిమంతులకు కొదవ లేదు. అలాంటి వారిలో కొంతమంది పిల్లలు, కొన్ని పేరున్న కళాశాలల్లో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్, కారు రేసుల్లో పాల్గొంటున్నారు.
     
     భీమిలి, ఐఎన్‌ఎస్ కళింగ, రుషికొండ, రామానాయుడు స్టూడియో, మధురవాడ-బావికొండ రోడ్డు, మారికవలస-తిమ్మాపురం బీచ్‌రోడ్డు, ఐటీ సెజ్, సాగర్‌నగర్, తొట్లకొండ తదితర ప్రాంతాలతో పాటు బీచ్‌రోడ్డులోనూ రేసింగ్‌లకు అనువైనవిగా ఎంచుకుంటున్నారు. గతంలో శని, ఆదివారాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే వారు. కొన్నాళ్ల నుంచి వీకెండ్ వరకు ఆగకుండా వీలు చిక్కినప్పుడల్లా రయ్‌మంటూ రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పున్నమి వెన్నెల వేళల్లో మరింతగా చెలరేగిపోతున్నారు.
     
     ‘అదుపు’ తప్పుతున్న యువతులు..
     ప్రస్తుతం యువకుల మాదిరిగానే కొంతమంది యువతులు, విద్యార్థినులు కూడా బైక్, కారు రేసులకు నడుం బిగించి ‘అదుపు’ తప్పుతున్నారు. మగపిల్లలతో సమానంగా బైకులతో ఫీట్లు కూడా చేస్తున్నారు. ఖరీదైన కార్లు, ఎక్కువ పికప్ ఉన్న బైకులతో చిత్ర, విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తున్నారు. ఆయా కాలేజీల నుంచి ఇళ్లకు బయల్దేరాక చీకటి పడేదాకా అక్కడా, ఇక్కడా షికార్లు కొడుతున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ రద్దీ తగ్గాక రోడ్లపైకి వస్తున్నారు. ఐదారుగురు ఏకమై గ్రూపుగా రేస్‌లకు దిగుతున్నారు.
     
    వీరిని ప్రోత్సహించడానికి కొందరు వారిపై బెట్టింగ్‌లు కూడా కాస్తున్నారు. ఇలా రేస్‌లో గెలిచిన సొమ్ముతో అంతా కలిసి జల్సా చేస్తున్నారు. కొందరు అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి పాల్గొంటున్న వారూ ఉన్నారు. ఒకరికొకరు కేరింతలు కొడుతూ బైక్‌లపై ప్రమాదకర  స్టంట్స్ చేస్తున్నారు.

    అంతేకాక ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న యువతులు కూడా ఉంటున్నారన్న వాస్తవం పోలీసులను విస్మయ పరుస్తోంది .ఇలా రేసింగ్ చేస్తూ ప్రమాదాల పాలవుతున్న సంఘటనలూ జరుగుతున్నాయి. ప్రమాదాల్లో గాయపడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం వంటివి ఇటీవల సంభవిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరి ఆగడాలకు ఇతర వాహన చోద కులూ ప్రమాదాలకు గురవుతున్నారు.  
     
    పోలీసులకూ తెలుసు..

    యువకులు, విద్యార్థులే బైక్, కారు రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులకు తెలుసు. అప్పుడప్పుడు సెట్ల ద్వారా వీరెక్కడ రేసుల్లో పాల్గొంటున్నారో తెలుసుకుని అప్రమత్తమవుతున్నారు. అయితే వీరిలో రాజకీయ కుటుంబాల వారో, సంపన్న వర్గాల పిల్లలో ఉండడం వల్ల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండడం లేదు.
     
    దాదాపు రెండేళ్ల క్రితం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో రేసు కారులో దూసుకెళ్తూ ఒకరి మృతికి కారణమైన ఘటనలో నిందితుడిని తప్పించారన్న ఆరోపణతో అప్పటి ట్రాఫిక్ ఎస్‌ఐని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఇలా రేసింగ్‌లకు పాల్పడుతున్న సుమారు 30 మంది కాలేజీ విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. చాలా సందర్భాల్లో ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు.
     
    అరికట్టడానికి సీసీ కెమెరాలు..
    రోజురోజుకూ విశాఖలో బైక్, కారు రేసుల సంస్కృతి పెరగడం, దానికిప్పుడు యువతులు, కాలేజీ విద్యార్థినులు కూడా తోడు కావడంతో పోలీసులు ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. రేసులకు అనువుగా ఉన్న సుమారు 10 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొంతవరకు రేస్‌లు జరగకుండా అరికట్టవచ్చని పోలీసుల వాదన.

>
మరిన్ని వార్తలు