హోలీ వేడుకల్లో విషాదం

12 Mar, 2017 23:23 IST|Sakshi
హోలీ వేడుకల్లో విషాదం
కాలువలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం
అనపర్తి : అప్పటి వరకు వారు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. ఆ వేడుకే చివరి వేడుకగా మిగులుతుందని ఊహించలేదు. మిత్రులందరితో సంతోషంగా గడిపిన కొద్ది సేపటికే ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి గల్లంతు కావడంతో తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనపర్తిలో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, అనపర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన నీలం పవన్, అనపర్తికి చెందిన కొవ్వూరి మధుసూధన్‌రెడ్డిలు అనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగను వీరు అనపర్తిలో మిగిలిన స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. తమపై పడిన రంగులను కడిగేసుకునేందుకు వీరిద్దరూ మరో స్నేహితుడు మనస్స్‌తో కలిసి నల్ల కాలువ వద్దకు వచ్చారు. అక్కడ మధుసూదన్‌ చొక్కా విప్పుకుని కాలువలో శుభ్రం చేసుకుంటున్న సమయంలో కాలుజారి గల్లంతైనట్టు తెలుస్తోంది. మధుసూదన్‌రెడ్డిని రక్షించే క్రమంలో పవన్‌ కూడా గల్లంతయ్యాడు. ఒడ్డున మనస్స్‌ ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఒక యువకుడికి తెలిపి బోరుమన్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కూడా నల్ల కాలువ వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో పవన్‌ అనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సిరసపల్లి నాగేశ్వరరావు మనవడు. విషయం తెలుసుకున్న సిరసపల్లి ఘటనా స్థలానికి చేరుకుని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్సై కిషోర్‌బాబు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, అనపర్తి డీసీ చైర్మన్‌ తాడి వెంకటరామారెడ్డి, తహసీల్దార్‌ ఆదినారాయణ తదితరులు ఘటనా స్థలికి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పవన్‌ మృతదేహం లభ్యమైంది.  పవన్‌ కాలికి చెప్పులు ఉండడంతో మధు సూదన్‌రెడ్డిని రక్షించే క్రమంలో మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాత్రి సమయం కావడం.. గాలింపునకు  అననుకూలంగా ఉండకపోవడంతో గాలింపు చర్యలను నిలుపుదల చేశారు. 
తల్లిదండ్రుల చెంతకే పవన్‌ 
కాలువలో స్నేహితుడిని రక్షించబోయి మృతి చెందిన పవన్‌ తల్లిదండ్రుల చెంతకే వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. పవన్‌ తల్లిదండ్రులు సంధ్య, వీరభద్రరావులు దుప్పలపూడిలో ఉండేవారు. రెండేళ్ల క్రితం వీరభద్రరావు గుండెపోటుతో చనిపోగా, భర్త చనిపోయిన మూడు నెలలకే సంధ్య కూడా మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరి చిన్నారులు తాతయ్య సిరసపల్లి నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటున్నారు. నాగేశ్వరరావు కుమార్తెను, అల్లుడిని మనవళ్లలో చూసుకుంటూ జీవిస్తున్న సమయంలో ఇప్పుడు చిన్న మనవడు పవన్‌ కాలువ ప్రమాదంలో మృతి చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవుడా ఎంత కష్టం పెట్టావంటూ నాగేశ్వరరావు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సహచర ప్రజాప్రతినిధులు నాగేశ్వరరావును ఓదార్చే ప్రయత్నం చేశారు. 
మరిన్ని వార్తలు