లెక్క తప్పింది!

9 May, 2017 01:34 IST|Sakshi
లెక్క తప్పింది!

మ్యాథ్స్‌లో ఎక్కువగా ఫెయిలవుతున్న విద్యార్థులు
ఏటా పడిపోతున్న ఉత్తీర్ణత శాతం
లెక్కల మాస్టార్లు ఉన్నా ఫలితం శూన్యం
పర్యవేక్షణ లేమి, ప్రభుత్వ తీరుపై విమర్శలు
నెరవేరని ‘మహా సంకల్పం’
ఇకనైనా మేల్కొంటారో..లేదో?


లెక్క తప్పింది. ఈ సారీ పది ఫలితాల్లో జిల్లా అట్టడుగునే నిలిచింది. దీనికి లెక్కల సబ్జెక్టే ప్రధాన కారణమైంది. మాస్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. తరచూ అధికారులను మార్చేయడం, ఇన్‌చార్జ్‌ అధికారులతోనే నెట్టుకురావడం.. పర్యవేక్షణ లేకపోవడమే పెద్ద పొరబాటని ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.  

చిత్తూరు, సాక్షి: పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతమూ తగ్గిపోయింది. గత ఏడాది 90.11 శాతం ఉత్తీర్ణత వస్తే.. ఈసారి 80.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా వరుసగా మూడోసారి చివరిస్థానంలో నిలవడంపై కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న అసంతృప్తికి లోనయ్యారు. చీటికీమాటికీ అధికారులను మార్చడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

మూడు ముక్కలాట
విద్యాశాఖకు కొంతకాలంగా పూర్తిస్థాయిలో అధికారి లేరు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇన్‌చార్జ్‌ డీఈవోతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. ఆయనకు (తిరుపతి డీవైఈవో, ఇన్‌చార్జ్‌ డీఈవో, ఇన్‌చార్జ్‌ పీవో) మూడు పదవులుండడంతో పనిభారం ఎక్కువైపోయింది. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పది ఫలితాల్లో వెనుకబడటానికి కారణాలివే
పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన తరుణంలో డీఈవోను మార్చివేశారు
ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయింది
ఎంఈవో పోస్టులను విద్యా సంవత్సరం చివరలో చేపట్టారు
గత ఫలితాలపై విశ్లేషించుకోలేకపోయారు
సిలబస్‌ నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోయారు

లెక్క తప్పింది ఇలా..
ఆరేళ్ల నుంచి జిల్లా విద్యార్థులు గణితంలో అధికంగా ఫెయిలవుతున్నారు. దీనిపై అధికారులు శ్రద్ధ చూపలేకపోయారు. లెక్కల మాస్టార్లు 1,900 మంది ఉన్నా ఫలితాల్లో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఒక్కో పాఠశాలలో కనీసం ఇద్దరు లెక్కల టీచర్లు ఉన్నారు. అయినా ఉత్తీర్ణత సాధించడంలో వెనకబడి పోతున్నారు. ఈ ఏడాది పదిలో లెక్కల పరీక్ష 27,464 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,699 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ1 గ్రేడు సాధించనవారు వందల మంది మాత్రమే.

‘మహా’ వృథా
పది ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు గత కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ మహాసంకల్పం పేరుతో విద్యార్థులకు వారానికో పరీక్ష జరిపించారు. ఎక్కడ వెనుకబడ్డారో గమనించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు డీఈవో ఆఫీసుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అదునుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వచ్చే మార్కులను ఎక్కువ చేసి పంపడం నేర్చుకునేశారు. మహా సంకల్పం వృథాగా మారిపోయింది.

రాజకీయ జోక్యం ఎక్కువ
విద్యారంగంపై రాజకీయ జోక్యం ఎక్కువ. శాఖల్లో ఉన్నత స్థానం ఖాళీ అయితే వాటిని అధికార పార్టీ నాయకుల ఇష్టులకే వదిలేయడం రివాజుగా మారుతోంది. అనర్హులు ఉన్నత స్థానాలను అ«ధిరోహిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ వారి మాట వినకుంటే నిర్ధాక్షణ్యంగా వేటు వేయడం పరిపాటిగా మారిపోయింది. డీఈవో నాగేశ్వరరావు ఉదంతాన్నే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.

మరిన్ని వార్తలు