లేడీస్ హాస్టల్‌లోకి విద్యార్థుల చొరబాటు

26 Mar, 2016 07:52 IST|Sakshi
లేడీస్ హాస్టల్‌లోకి విద్యార్థుల చొరబాటు

♦ విద్యార్థినులతో ఏపీ మంత్రి కళాశాల విద్యార్థుల అసభ్య ప్రవర్తన
♦ విశాఖలోని ఓ హాస్టల్‌లో ఘటన
♦ పోకిరీలకు దేహశుద్ధి చేసిన అమ్మాయిలు... పోలీసులకు అప్పగింత
♦ కేసు మాఫీకి మంత్రి ఒత్తిడి?
 
 గాజువాక/అక్కిరెడ్డిపాలెం: విశాఖపట్నంలోని షీలానగర్‌లో ఉన్న ఓ లేడీస్ హాస్టల్‌లోకి ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు గురువారం అర్ధరాత్రి చొరబడి వెకిలిచేష్టలు చేశారు. అక్కడున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అమ్మాయిలు తిరగబడి వారిని తరిమికొట్టారు. ముగ్గురు పోకిరీలను పట్టుకుని దేహశుద్ధి చేయడమేగాక పోలీసులకు అప్పగించారు. అయితే కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏపీకి చెందిన ఓ మంత్రిది కావడంతో ఈ ఘటనను బయటకు పొక్కకుండా, ఎలాంటి కేసూ లేకుండా చేసేం దుకు సదరు మంత్రి ప్రయత్నించి.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే హాస్టల్ విద్యార్థినులు పట్టువిడవకపోవడంతో చివరకు పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. అయినప్పటికీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల అరెస్టు చూపించకుండా గోప్యత పాటిస్తున్నా రు. హాస్టల్ విద్యార్థినులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలివి...

 అర్ధరాత్రివేళ విద్యార్థుల ఆగడం..
 విశాఖపట్నం షీలానగర్‌లో కృషి ఆస్పత్రి పక్కన ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాల, దాని పక్కనే మనీషా నర్సింగ్ విద్యార్థినుల హాస్టల్ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలకు చెందిన కొంద రు విద్యార్థులు గురువారం అర్ధరాత్రి సమయంలో గోడ దూకి నర్సింగ్ హాస్టల్‌లోకి ప్రవేశించారు. గమనించిన విద్యార్థినులు భయంతో పెద్దగా కేకలేశారు. బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. పట్టించుకోని జూనియర్ కళాశాల విద్యార్థులు మరింతగా రెచ్చిపోతూ.. అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైపైకి వెళ్లారు. దీంతో విద్యార్థినులు తిరగబడ్డారు. అంతా ఏకమై వారిని తరిమికొట్టారు. ఈ క్రమంలో దొరికిన ముగ్గురు విద్యార్థులకు దేహశుద్ధి చేసి గాజువాక పోలీసులకు అప్పగించారు.

నర్సింగ్ హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్లు.. కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపాల్‌ను కలసి జరిగిన విషయాన్ని వివరించారు. ఈలోగా విషయం తెలుసుకున్న కార్పొరేట్ జూనియర్ కళాశాల యజమాని అయిన మంత్రితోపాటు స్థానిక మంత్రి ఒకరు అటు పోలీసులు.. ఇటు నర్సింగ్ హాస్టల్ సిబ్బందిపైఒత్తిడి తెచ్చి విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న మీడియా.. నర్సింగ్ హాస్టల్, కార్పొరేట్ కళాశాల వద్దకెళ్లినా అక్కడి సిబ్బంది నోరువిప్పలేదు.

మరోవైపు సౌత్ ఏసీపీ జి.బి.ఆర్.మధుసూదనరావు, గాజువాక సీఐ మళ్ల అప్పారావు తదితరులు కార్పొరేట్ కళాశాల సిబ్బందితో సమావేశమయ్యారు. తర్వాత మనీషా నర్సింగ్ హాస్టల్‌లో వివరాలు సేకరించారు. అయితే విలేకరులకు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. కాగా, జూనియర్ కళాశాల మంత్రికి చెందింది కావడంతో అటు పోలీసు లు.. ఇటు నర్సింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థినులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో పోలీసులు శుక్రవారం సాయంత్రందాకా కేసు నమోదు చేయలేదు. అయితే బాధిత విద్యార్థినులు వెనక్కి తగ్గలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. దీనిపై వివరణ కోరగా.. విచారణ జరుగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని సీఐ మళ్ల అప్పారావు తెలిపారు.

మరిన్ని వార్తలు