పెట్రేగిన ర్యాగింగ్‌ రక్కసి

9 Sep, 2016 23:58 IST|Sakshi
పెట్రేగిన ర్యాగింగ్‌ రక్కసి
 
  • నాగార్జున యూనివర్శిటీలో మరోమారు వెలుగులోకి
  • గురువారం అర్ధరాత్రి హాస్టలులో ఘటన
  • జూనియర్లను వేధించిన సీనియర్లు
  • ఐదుగురి సస్పెన్షన్‌
 
 సాక్షి, గుంటూరు : మొన్న రిషితేశ్వరి.. నిన్న సునీత, తిరుపతమ్మ.. ఇలా జిల్లాలో అభంశుభం తెలియని ఎంతోమంది విద్యార్థినులు పోకిరీల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. తాజాగా శుక్రవారం నాగార్జున యూనివర్సిటీలో జూనియర్‌ విద్యార్థి జయంత్‌ను ఐదుగురు సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఐదుగురు సీనియర్‌ విద్యార్థులను ఏఎన్‌యూ అధికారులు సస్పెండ్‌ చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు అక్కడ కీచక ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో పెడుతున్న చిత్రహింసలు భరించలేక, లైంగిక వేధింపులు తట్టుకోలేక అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఏడాది కాలంలో ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక బలయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిషితేశ్వరి సంఘటన తరువాత ఏఎన్‌యూలో మూడు ర్యాగింగ్‌ సంఘటనలు జరిగాయి. కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లోని కొందరు ఆకతాయిలు నిత్యం పెడుతున్న చిత్రహింసలు, లైగింక వేధింపులు భరిస్తూ కళాశాలలకు వెళ్లలేక.. ఈ విషయాన్ని ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పి వారిని బాధపెట్టలేక నలిగిపోతున్నారు. ఎంత ఓపిక పట్టినా వీరి వేధింపులు ఆగకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పొరపాటో, కళాశాలల్లో ఉపాధ్యాయుల పొరపాటో తెలియదు కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం కాబోతున్న గుంటూరు జిల్లాలో వరుస సంఘటనలు జరగడానికి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమైతే.. పోలీసుల ఉదాసీన వైఖరి కూడా కారణంగా చెప్పవచ్చు. కొన్ని కళాశాలల్లో ఇప్పటికీ యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
మరిన్ని వార్తలు