వసతిగృహల్లో విద్యార్థుల పరిస్థితి దారుణం

2 Aug, 2016 19:51 IST|Sakshi
వసతిగృహల్లో విద్యార్థుల పరిస్థితి దారుణం

విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య
కందుకూరులో ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర ప్రారంభం

‍కందుకూరు : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, విద్యారంగ సమస్యల పరిరక్షణ కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా సైకిల్‌ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకుముందు స్థానిక ముదిరాజ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

      వనతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన భోజనం అందక పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు కరువవడంతో బాలికలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు పోరాటాల ద్వారానే హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించుకున్నామే తప్ప.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు తప్పవన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డీ జగదీష్‌, రాజేంద్రనగర్‌ జోన్‌ కార్యదర్శి ఆనంద్‌, అధ్యక్షుడు కేవై ప్రణయ్‌, నాయకులు హరి, ప్రభావతి, మల్లేష్‌, భాను, వాజిద్‌, సాయి, మహేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు