దద్దరిల్లిన హోదా నినాదం

31 Jan, 2017 02:15 IST|Sakshi
దద్దరిల్లిన హోదా నినాదం
అత్తిలి (తణుకు) : ప్రత్యేక హోదా ఉద్యమం జిల్లాలో విస్తరిస్తోంది. సోమవారం అత్తిలి, చింతలపూడిలో ప్రత్యేక హోదా నినాదం దద్దరిల్లింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు అత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఎస్‌ఎస్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు ర్యాలీగా గ్రామ పుర వీధుల్లో తిరిగి ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. అనంతరం బస్‌స్టేన్‌ సెంటర్‌లో మానవహారంగా నిలబడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. హోదాతో పరిశ్రమలు ఏర్పాటువుతాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తామంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదాయే కావాలని డిమాండ్‌ చేశారు. 
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తుగా పోలీస్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని ఎస్సై వీఎస్‌ వీరభద్రరావు విద్యార్థులకు తెలిపారు. దీంతో కొద్దిసేపు ర్యాలీ నిలిచిపోయింది. వైఎస్సార్‌ సీపీ నాయకులు విద్యార్థులు చేస్తున్న ర్యాలీ వద్దకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు విద్యార్థులకు సంఘీభావం తెలిపి, ర్యాలీని కొనసాగించారు. దీంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దాల నాగేశ్వరరావు, బుద్దరాతి భరణీప్రసాద్, ఆకుల చినబాబు, పైబోయిన సత్యనారాయణ, కంకటాల సతీష్, మద్దాల శ్రీనివాస్, గూనా మావుళ్లు, పైబోయిన శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు.  
చింతలపూడిలో రాస్తారోకో, ధర్నా
చింతలపూడి (జంగారెడ్డిగూడెం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై సోమవారం «రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.ధామస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీలకు అలవాటు పడి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. అంతకు ముందు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చీకటి జగపతిరావు అధ్యక్షతన జరిగిన గాంధీవర్ధంతి కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్నాలో కాంగ్రెస్‌ నాయకులు సంకు ప్రసాద్, నిరీక్షణ, వేట వెంకన్న, సుందరం, మూర్తు జాలి, సుబ్బారావు, సూర్యనారాయణ, వెంకన్నబాబు, పాండురంగారావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు