కిక్‌ ఇస్తే ఖంగు తినాల్సిందే!

20 Oct, 2016 22:31 IST|Sakshi
కిక్‌ ఇస్తే ఖంగు తినాల్సిందే!

– కరాటేలో రాణిస్తున్న విద్యార్థినులు
వీరు కిక్‌ ఇచ్చారంటే ప్రత్యర్థి ఖంగు తినక తప్పదు. అమ్మాయిలే కదా అనుకుని వీరితో తలపడితే ఇక అంతే సంగతులు. కరాటేలో అబ్బాయిలకు సైతం ఏ మాత్రం తీసిపోకుండా పాఠశాల స్థాయిలో మొదలు పెట్టిన కరాటే ఇప్పుడు వీరిని జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించే దిశగా తీసుకెళ్లింది. శిక్షకుల సూచనలను ఆచరిస్తూ ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలో పతకాలను సాధించారు పరిగి మండలం శాసనకోటకు చెందిన కె.లత, ఆర్‌.నందిని, బి.జోత్సS్న. పేద వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రతిభకు ఏదీ అడ్డురాదంటూ నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

శాసనకోటకు చెందిన కె.నాగభూషణం, కె.శారదమ్మ కుమార్తె కె.లత. 6వ తరగతి నుంచి కరాటేను నేర్చుకుంటోంది. ప్రస్తుతం హిందూపురం పట్టణంలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంఈసీ చదువుతోంది. పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి   కరాటే పోటీల్లో రాణిస్తూ బంగారు పతకాలను సాధించింది. గౌరీబిదనూరులో జరిగిన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు, హిందూపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో రాణించి పలు పతకాలు సాధించింది.

ప్రస్తుతం ఇంటర్‌లో ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్‌.నందిని శాసనకోటకు చెందిన ఎన్‌.నరసింహమూర్తి, చెన్నమ్మల కుమార్తె. ఈమె  ఆరు సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ పొందుతోంది. జిల్లా స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కరాటేలో ప్రతిభను చూపుతూ బంగారు పతకాలను సాధించింది. గౌరీబిదనూరు, హిందూపురంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ ముందుకు సాగుతోంది.

6వ తరగతి నుంచి జాతీయస్థాయి కరాటే పోటీల్లో రాణిస్తోంది  బి.జోత్సS్న. ఈమె శానసనకోటకు చెందిన బి.ప్రకాష్‌రాజ్, ఎస్‌.శాంతకుమారిల కుమార్తె. ప్రస్తుతం ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై మక్కువ పెంచుకుంది.  ఇప్పటికే గౌరీబిదనూరు, హిందూపురంలో రెండు సార్లు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన సత్తాను చాటి బంగారు పతకాలను, షీల్డులను సాధించింది.

ప్రభుత్వాలు సాయమందించాలి
కరాటేలో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వాలు సాయమందించాలి. పేదరికంలో ఉన్నప్పటికి విద్యార్థినులు కరాటేపై మక్కువతో జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వీరిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే సత్తా ఉంది. ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి.
– జనార్దన్‌రెడ్డి, కోచ్, హిందూపురం

మరిన్ని వార్తలు