విద్యార్థుల 'ట్రిపుల్ ఐటీ' ఆశలు ఆవిరి

27 Jun, 2016 08:00 IST|Sakshi

వేంపల్లె: ఆర్‌జేయూకేటీ యూనివర్సిటీ మొదట ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్ నుంచి తీసివేసి తాజాగా ఆదివారం రెండవ జాబితా విడుదల చేయడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిధిలో వంద మందికిపైగా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన ఆనందంలో విద్యార్థులు ఉండగా తాజా జాబితాతో వారి నిశ్చేష్టులయ్యారు. మొదటి జాబితా విడుదల చేసిన అనంతరం మోడల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థినులకు 0.4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో మొదట సీట్లు పొందిన  విద్యార్థులు రెండో జాబితాలో పేర్లు గల్లంతైన విషయాన్ని చూసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.
 
సాయంత్రం ఓ జాబితా.. అర్ధరాత్రి మరోజాబితా..!
వివరాల్లోకి వెళితే.. ఇడుపులపాయ ఆర్‌జీయూకేటీ పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయ ఐఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను శనివారం అధికారులు వెబ్‌సైట్లో ఉంచారు. అదేరోజు సాయంత్రం కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మోడల్‌స్కూల్లో చదివిన విద్యార్థులకు 0.4 మార్కులు యాడ్ చేయాలని జీవో వెలువడడంతో శనివారం అర్ధరాత్రి తర్వాత వెబ్‌సైట్‌లో రెండో జాబితాను విడుదల చేశారు.

దీంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 42 మంది విద్యార్థుల సీట్లు గల్లంతయ్యాయి. ఆర్‌జీకేయూటీ అధికారులు, ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని.. ఇలాంటి చర్యలతో విద్యార్థులు తీవ్ర వేదనకు గురయ్యే అవకాశముందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు