మట్టి పనులకు వెళ్లి చదువుకున్నా

2 Aug, 2016 00:08 IST|Sakshi
  • ఎప్పుడూ టీచర్లతో దెబ్బలు తినలేదు
  • తెలంగాణ ఉద్యమం అంటే మహా పిచ్చి
  • కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారు
  • సన్మాన సభలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య
  • పరకాల : తట్టలు ఎత్తాను... రోడ్డు పనులకు వెళ్లాను... మట్టి పనులకు వెళ్లి చదువుకున్నానని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ పసుల సాంబయ్య అన్నారు. వీసీగా నియమితులైన సందర్భంగా ఆయన స్వగ్రామమైన మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో సోమవారం సన్మాన సభను నిర్వహించారు. న్యాయవాది ఏరుకొండ జయశంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ పసుల సాంబయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ సాంబయ్య మాట్లాడుతూ గ్రామంలో 50పైసలకు కూలీ పోయే వాడినన్నారు. నాగారం, పైడిపల్లి రోడ్డు నిర్మాణం పనికి పోయానని చెప్పారు. ఈ రోడ్డు పోసే పనికి పోయి ఇప్పుడు అదే రోడ్డుపై కారులో వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కష్టపడే తత్వం, నమ్మకం ఉంటే పైకి రావచ్చన్నారు. చదువులో అందరి కంటే ముందు ఉండేవాడినని అన్నారు. టీచర్లతో ఒక్క దెబ్బ తినకుండా చదువుకున్నానని తెలిపారు. బాగా చదివే పిల్లలను ఉపాధ్యాయులు ప్రేమిస్తారన్నారు. చదువులో రాణిం చడం కారణంగా జయపాల్, హరగోపాల్‌ సార్లు ప్రోత్సాహాన్ని అందించారన్నారు. చదువుతున్న క్రమంలోనే ఉద్యోగాలు వచ్చాయన్నారు. లెక్చరర్‌ కావాలనే ఏకైక కారణంతో కష్టపడి చదువుకున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్య మం అంటే మహా పిచ్చిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వ్యాసాలు రాశానని చెప్పారు. 
    అదే అనుభవంతో సమావేశాల్లో మాట్లాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నానని తెలిపారు. ఆత్మకూరులో జరిగిన సమావేశంలో నా ప్రసంగం కోసం ప్రజలు పట్టుబట్టడంతో వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్‌ ఆశ్చర్య పోయారన్నారు. టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎంపీ, ఎమ్మెల్యేలను మెప్పించానని తెలిపారు. నా ప్రసంగాలే సీఎం కేసీఆర్‌కు దగ్గర అయ్యేటట్లు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమిస్తానని అంటే తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. వరంగల్‌ ఎంపీ టికెట్‌ను తిరస్కరించి, వీసీ మాత్రమే కావాలని అడిగానన్నారు. తెలంగాణ యూనివర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేసీఆర్‌కు నచ్చితే అభిమానిస్తారని అన్నారు. గొప్ప పట్టుదల ఉన్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమం లో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, ఎంపీటీసీ ఎరుకొండ రమాదేవి–శ్రీనివాస్, కోడూరి మల్లేశం, బాల్య స్నేహితులు గంప లింగమూర్తి, ఆనం దం, రాందాసు, హంసారెడ్డి, నర్సింహరామ య్య, కేయూ పరిశోధక విద్యార్థులు మడికొండ శ్రీను, మార్క కిరణ్, ముంజం ప్రకాష్‌ , సీఐ విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు