వరద నీటికి కొత్త నడక

4 Mar, 2017 22:21 IST|Sakshi
వరద నీటికి కొత్త నడక

నగరంలో స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్లు
మేజర్‌ 142, మైనర్‌ 302 కిలోమీటర్ల మేర నిర్మాణం
ఫిబ్రవరి 2019 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం
ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించిన కమిషనర్‌


నగరంలో 444 కిలోమీటర్ల మేర స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణ పనులు  ప్రారంభమయ్యాయి. రూ.461 కోట్ల వ్యయంతో నిర్మించే వీటిని 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు నగర పాలక సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారులకు కమిషనర్‌ జి.వీరపాండియన్‌ అవగాహన కల్పించారు.

విజయవాడ సెంట్రల్‌ : నగరంలో వర్షపు నీటి సమస్యకు స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్లతో చెక్‌ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. 59 డివిజన్ల పరిధిలో 302 కిలోమీటర్ల మేర మైనర్, 142 కిలోమీటర్ల మేర మేజర్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి కాంట్రాక్ట్‌ అప్పగించారు. డిజైన్, పర్యవేక్షణ బాధ్యతల్ని పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షించనుంది.

శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్‌ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పబ్లిక్‌హెల్త్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాసులు ప్రజాప్రతినిధులకు వివరించారు. నగరాన్ని ఏడు బేసిన్‌లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు.  అవసరమైన ప్రాంతాల్లో కల్వర్ట్‌ బాక్సుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  కాలువల హెచ్చుతగ్గులపై ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. డ్రెయిన్ల పొడవు, లోతు, ఎత్తు, ఏ కాల్వకు అనుసంధానం చేస్తున్నది, ఎక్కడెక్కడ బాక్స్‌ కల్వర్టుల నిర్మాణం చేస్తున్నారనే విషయాలపై వివరించారు.

వందేళ్ల వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుని......
స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్లకు సంబంధించి తొలుత 142 కిలోమీటర్ల మేర మేజర్‌ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ప్రజాప్రతినిధుల సూచన మేరకు 200 కిలోమీటర్ల మేర పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. నగరంలో వంద సంవత్సరాల వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని డ్రెయిన్ల డిజైన్‌ రూపొందించినట్లు కమిషనర్‌ జి.వీరపాండియన్‌ వెల్లడించారు. డ్రెయిన్‌ నాలుగు అడుగుల వెడల్పు దాటితే కవరింగ్‌ శ్లాబ్‌ వేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డ్రెయిన్లపై ఫుట్‌పాత్, రోడ్లు ఏర్పాటు చేసే విధంగా డిజైన్‌ రూపొందించినట్లు తెలిపారు. స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయిన్ల నిర్మాణం కోసం నగరంలోని 130 ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందన్నారు.

ఈ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాల్సిందిగా సూచించారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మేయర్‌ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణారావు, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్లు జి.హరిబాబు, బి.ఎన్‌.పుణ్యశీల పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.అంకయ్య, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు