గుట్కాలు దొరికితే ఎస్‌ఐలదే బాధ్యత

8 Jun, 2017 17:57 IST|Sakshi
గుట్కాలు దొరికితే ఎస్‌ఐలదే బాధ్యత

► నేర సమీక్షలో ఎస్పీ బ్రహ్మారెడ్డి

శ్రీకాకుళం సిటీ : జిల్లాలో ఏ దుకాణంలోనైనా గుట్కాలు, ఖైనీలు అమ్మితే ఆ పరిధిలోని ఎస్‌ఐను బాధ్యునిగా చేస్తూ చర్యలు తీసుకుంటామని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుట్కా, ఖైనీలు అమ్మిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని సీఐలను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ఎన్‌హెచ్‌ఏ1 అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్‌హెచ్‌–16లో రోడ్లపై నిలిపివేసిన వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగితే అందుకు ఎన్‌హెచ్‌ఏ1 అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

శ్రీకాకుళం, రాజాం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, పాతపట్నం, పాలకొండ తదితర ముఖ్య పట్టణాల్లో కార్డెన్‌సెర్చ్‌లు, ఏరియా డామినేషన్లను వారానికోసారైనా జరపాలని ఆదేశించారు. అసాంఘిక చర్యలను, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు షేక్‌ షరీనా బేగం, కె.వరప్రసాదరావు, డీఎస్పీలు కె.భార్గవరావునాయుడు, వివేకానంద, ఆదినారాయణ, టి.మోహనరావు వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్‌ఐలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు