అమ్మదొంగా.. రింగ రింగా!

23 Oct, 2016 00:21 IST|Sakshi
  •  కాంట్రాక్టర్లకు ఎస్సీ సబ్‌-ప్లాన్‌ పనులు పంచేసిన టీడీపీ ముఖ్యనేత
  •  ఆనం సోదరుల ఎత్తుకు పైఎత్తు
  •  కార్పొరేషన్‌ మీద అదనంగా రూ.2కోట్లు భారం
  • సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక దందా, టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు తల దూర్చవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించి వారం రోజులు కూడా గడవక ముందే ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన్‌ పరిధిలో జరగబోయే రూ. 42కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌ పనులను దగ్గరుండి రింగ్‌ చేశారు. నిర్ణయించిన అంచనా వ్యయం కంటే రూ.2కోట్లు రూపాయిలను అదనంగా కొల్లగొట్టడానికి రంగం సిద్దం చేశారు. టీడీపి ముఖ్య నాయకుడి నేతృత్వంలో శనివారం సాయంత్రం పనుల సెటిల్‌మెంట్‌ పూర్తిచేశారు.
    కార్పొరేషన్‌ పరిధిలోని దళితవాడల్లో అభివృద్ది పనుల కోసం ఈ ఏడాది మార్చిలో రూ.42కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో 8 ప్యాకేజిల కింద పనులు చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే టీడీపీ ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల పనుల పంపకంలో అభిప్రాయం కుదరలేదు. దీంతో ఆరు నెలల పాటు ఈ పనుల ప్రక్రియ అటకెక్కింది. అభివృద్ది పనుల విషయంలో అధికార పార్టీ చేస్తున్న రాజకీయాలను నిరసిస్తూ ఎస్సీ సబ్‌-ప్లాన్‌లకు వెంటనే టెండర్లు పిలవాలని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ఇటీవల కార్పొరేషన్‌ను ముట్టడించారు. దీంతో 8 ప్యాకేజీలకు ఎట్టకేలకు టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్లు ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఆనం సోదరులు అనూహ్యంగా రంగంలోకి దూకారు. నెల్లూరు నగర, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకునేందుకు తమ మద్దతుదారు కాంట్రాక్టర్లను రంగంలోకి దింపి ఎస్సీ సబ్‌-ప్లాన్‌ పనులను చేజిక్కించుకునే ఎత్తుగడ వేశారు. పనుల కోసం పోటీ పడుతున్న కాంట్రాక్టర్లతో నేరుగా చర్చలు జరిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిలు టెండర్ల చివరి తేదీని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగింపజేశారు. సమయం తీసుకుని కాంట్రాక్టులందరిని సమావేశ పరిచి తాము చెప్పిన వారికే పనులు దక్కేలా చేసే వ్యూహం రచించారు. ఈ రకంగా ఆనం సోదరులను దెబ్బకు దెబ్బ తీసే ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా అధికార పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు శనివారం సాయంత్రం కాంట్రాక్టర్లను సమావేశ పరిచారు. టీడీపీ సిటీ నియోజకవర్గ ముఖ్యనేత కుటుంబ సభ్యుడికి 3 ప్యాకేజీలు, మిగిలిన పనులను తమ మద్దతుదారులకు పంచేసేలా సెటిల్‌మెంట్‌ చేశారు. ఎవరికైతే పనులు అప్పగించారో వారు 4.5 శాతం నుంచి 4.9 శాతం వరకు అధిక మొత్తంలో టెండర్లు దాఖలు చేసేలా తీర్మానించారు. వీరికి డమ్మీగా టెండరు షెడ్యూలు దాఖలు చేసే మరో వ్యక్తి 5శాతం కంటే ఎక్కువతో కోట్‌ చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ పనుల పందేరంతో కార్పొరేషన్‌ మీద అదనంగా రూ.2కోట్లు రూపాయిల భారం పడబోతోంది. సోమవారం సాయంత్రానికి ఈ టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది.
     
మరిన్ని వార్తలు