సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ!

25 Oct, 2016 23:59 IST|Sakshi
సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ!

 నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అరకొరగా ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడంతో చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. దీంత యువత ఆందోళన చెందుతోంది. కొంతమంది చిన్నచిన్న దుకాణాలను పెట్టుకొని బతుకుబండిని నడపాలని చూస్తున్నారు. సబ్సిడీ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉండడం.. ఒక్క యూనిట్ కోసం పది మందికి పైగా పోటీపడుతున్నారు. మరో వైపు టీడీపీ కార్యకర్తల పెత్తనం అధికమైందనే విమర్శలు వస్తున్నాయి. సాదాసీదా పని నుంచి సబ్సిడీ రుణాల వరకూ అన్నీ జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే జరుగుతుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు.
 
 రాజాం(సంతకవిటి): వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఎక్కడ తమకు రుణం మంజూరు కాదేమోనని లబ్ధిదారులు దిగులు చెందుతున్నారు. సబ్సిడీ రుణాల మంజూరు విషయంలో కూడా జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం ఉండడంతో అర్హులైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బినామీ లబ్ధిదారులతో దరఖాస్తులు చేయించడంతో వీటి సంఖ్య ఎక్కువగా ఉండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఒక యూనిట్‌కు పది నుంచి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు.  
 
 ఎస్టీ రుణాలకు ఇలా..
   ఎస్టీ సబ్సిడీ రుణాల కోసం ఇటీవల దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 252 యూనిట్లు కేటాయించగా ఈ నెల 24వ తేదీ వరకూ 5,511 దరఖాస్తులు అన్ని మండల కార్యాలయూలకు చేరాయి. వీటిలో 508 మంది నేరుగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా, మిగిలిన 428  ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు.
 
 బీసీ రుణాలకు తీవ్ర పోటీ
  బీసీ రుణాల కోసం కూడా దరఖాస్తులు అధికంగానే వచ్చాయి.  జిల్లా వ్యాప్తంగా 1800 యూనిట్లు మంజూరవ్వగా.. వీటి కోసం 21,432 మంది పోటీ పడుతున్నారు. వీటిలో 21,405 మందిదరఖాస్తు చేసుకోగా, మిగిలినవి ఎంపీడీఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి.
 
  ఎస్సీ రుణాల కోసం
  ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరయ్యే సబ్సిడీ రుణాల కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉంది. 1027 యూనిట్లు జిల్లాకు మంజూరవ్వగా వీటి నిమిత్తం సోమవారం నాటికి 7,874 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,859 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోగా, ఎంపీడీఓ కార్యాలయాల నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
 కాపు రుణాలకు...
  కాపు సబ్సిడీ రుణాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1147 వ్యక్తిగత యూనిట్లు మాత్రమే కాపు కార్పోరేషన్ మంజూరు చేయగా వెలమ, బలిజ తదితర కాపు జాతులకు చెందిన నిరుద్యోగులు 7002 మంది చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
 
  జన్మభూమి కమిటీల ప్రభావం
   గతంలో సబ్సిడీ రుణాలు బ్యాంకు మేనేజర్ల విల్లింగ్‌తో అధికారులు లబ్ధిదారులుకు ఇచ్చేవారు. రుణాలు కూడా సకాలంలో మంజూరయ్యేవి. ప్రస్తుతం వీటి పరిస్థితి మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి కూడా మండల స్థాయిలో జన్మభూమి కమిటీల ఆమోదం అవసమైంది. బ్యాంకు మేనేజర్లు సైతం కమిటీల కనుసన్నల్లోనే ఉన్నారు. ఫలితంగా చాలాచోట్ల కమిటీలు పలువురు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను తెరపైకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి దరఖాస్తు చేసినప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యే వరకూ మొత్తం బాధ్యత కమిటీ సభ్యులు బినాబీలుగా వ్యవహరించి తీసుకుంటారనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రుణం మాత్రమే బ్యాంకు నుంచి లబ్దిదారునికి చెక్ రూపంలో అందుతుంది. అనంతరం ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ రుణాలను కమిటీసభ్యులు, లబ్ధిదారులు పంచుకుంటారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగి ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు