స్వచ్ఛ పందిల్ల

30 May, 2017 23:21 IST|Sakshi
స్వచ్ఛ పందిల్ల

నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో జాతీయస్థాయి గుర్తింపు
సమష్టి కృషితో సక్సెస్‌
కేంద్ర బృందం సర్వే పూర్తి
అధికారుల ప్రశంసలు    

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి):కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ స్వఛ్చభారత్‌మిషన్‌ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిల్ల గ్రామ పంచాయతీ నూటికినూరు శాతం పూర్తి చేసుకుని సక్సెస్‌ సాధించిం ది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎల్‌ నిర్మాణంలో జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశంలో నూరు శాతం ఐఎస్‌ల్‌ పూర్తి చేసుకున్న గ్రామాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

ఈమేరకు ఈనెల 28న కేంద్ర బృందం గ్రామంలో ఇంటింటి సర్వే పూర్తి చేసుకుని నివేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆప్‌లో పొందుపరిచింది మండలంలోని మారుమూల గ్రామం పందిల్ల. ఇక్కడ 2,226 జనాభా, 1305 మంది ఓటర్లు ఉన్నారు. 564 నివాసగృహాలున్నాయి.  559 గృహాల్లో ఐఎస్‌ఎల్‌ నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలిన ఐదు వివిధ దశల్లో ఉన్నాయి. గుడిసెల్లో ఉన్నా.. ఇల్లు లేకున్నాస్వచ్ఛ పందిల్ల మరుగుదొడ్డి మాత్రం నిర్మించుకున్నారు. గ్రామస్తుల సమష్టి నిర్ణయంతోనే ఐఎస్‌ఎల్‌ సక్సెస్‌ అయింది. గ్రామంలో ప్రస్తుత పాలక వర్గంతోపాటు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, స్వశక్తి మహిళలు ఇందులోభాగస్వామ్యం అయ్యారు.

మరుగు దొడ్ల నిర్మాణం
ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం ఉండాలని గ్రామసభ తీర్మానించింది. మరుగుదొడ్డి నిర్మించుకోని ఇంటికి నల్లా, రేషన్‌ సరుకులు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, స్వశక్తి మహిళలు, వాస్తు నిపుణులందరూ కలిసి ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణాలకు ముగ్గు పోశారు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, గాజులు, ఇటుకలు, రేకులు, కుండీలు అన్నీ సమకూర్చారు. మేస్త్రీలూ ముందుకొచ్చి నిర్మాణాలను వేగవంతం చేశారు. మరికొందరు లబ్ధిదారులు స్వయంగానిర్మాణాలు చేసుకున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారులకుప్రభుత్వం రూ.12వేల చొప్పున అందించింది. అదే స్ఫూర్తితో ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకుని గ్రామ అభివృద్ధికి బాటలు వేశారు.


ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది
ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతం అయింది. ప్రజల చైతన్యంతోనే ఇది సాధ్యమైంది. పందిల్లను ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాం. మిగిలిన నిర్మాణాలు కూడా త్వరితగతిన పూర్తిచేస్తాం. మొత్తంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. బిల్లులు రాకుంటే లబ్ధిదారులు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు.
– ఎంపీడీవో పోలు సురేశ్‌

ప్రజల ఆరోగ్యం కోసం
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రజల ఆరోగ్యం బాగుపడింది. సీజనల్‌ వ్యాధులు తగ్గాయి. నిరుపేదలకు సైతం ప్రభుత్వం నిధులు సమకూర్చడంతో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. ప్రజలు కూడా ముందుకొచ్చారు. ప్రతిఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకునేలా అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. విజయం సాధించాం.
– సారయ్యగౌడ్, ఎంపీపీ

వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం
ఐఎస్‌ఎల్‌ అంటే వ్యక్తిగత పరిశుభ్రత. మరుగు దొడ్డి ఉన్న ఇంట్లో మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లే. ఆరుబయట బహిర్భుమికి వెళ్తే ప్రజలు రోగాల బారిన పడుతారు. ఈవిషయం ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రజలు సహకరించారు. మండలవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేస్తే ఆదర్శమండలంగా మార్గదర్శకులమవుతాం.
– లంక సదయ్య, జెడ్పీటీసీ

 గుడెసె ఉన్నా మరుగుదొడ్డి
మేం గుడిసెలు ఉంటున్నం. వర్షం పడితే అంతా ఉరుసుడే. గాలివస్తే గడ్డి ఎగిరిపోతది. మాకు ఇల్లులేదని, ఇల్లు కట్టియ్యాలని సార్లను అడిగినం. ఇత్తమన్నరు. అప్పటిదాక మరుగుదొడ్డి లేకుంటే ఎట్ల అన్నరు. మరుగుదొడ్డి కట్టుకోమని సార్లు, ఊరోళ్లు అందరూ చెప్పిండ్రు. కట్టుకున్నం. బిల్లుకూడా ఇచ్చిండ్రు. ఎండల పూరవతలకు పోవుడు తప్పింది.
– ఇల్లందుల పుష్పలత, లబ్ధిదారు

పట్నపోళ్లు నవ్వేటోళ్లు
మరుగుదొడ్డి కట్టుకున్నంక తిప్పలు తప్పినై. ఎండకాలం ఆరుబయటకు బహిర్భూమికి పోవాలంటే ఇబ్బందిపడేటోళ్లం. విరోచనాలు పెడితే ఆ బాధ వర్ణణాతీతం.  పట్నంల ఉన్న సుటాల్లు వస్తే నామోషయ్యేది. అందుకే మరుగుదొడ్డి కట్టుకున్నం. సుట్టాలందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నరు. ఇప్పుడు జరంత మాకు ఇలువ పెరిగింది.
– దబ్బెల రాధ, లబ్ధిదారు

ఆత్మగౌరవం కాపాడుకున్నారు
మరుగుదొడ్లు నిర్మించుకుని మహిళలు ఆత్మగౌరవం కాపాడుకున్నారు. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయత బాగున్నాయి. మహిళల కళ్లలో ఆనందం కనబడుతోంది. ప్రభుత్వం పల్లెల్లో పక్కాగృహాలు కట్టిస్తే మరింత సౌకర్యం ఉంటుంది. నూరుశాతం టాయిలెట్లు కట్టిన గ్రామంగా పందిల్ల గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.  
– గురువయ్య, కేంద్ర పరిశీలకులు
 

మరిన్ని వార్తలు