చేర్యాల బంద్‌ సక్సెస్‌

16 Aug, 2016 23:33 IST|Sakshi
బంద్‌తో బోసిపోయిన చేర్యాల ప్రధాన రోడ్డు
  •  సిద్దిపేట జిల్లాలో కలపాలని ఆందోళన
  • మూడు గంటల పాటు భారీ ధర్నా, రాస్తారోకో 
  • ఎమ్మెల్యే ప్రతిపాదనలపై తీవ్ర ఆగ్రహం
  •  
    చేర్యాల: చేర్యాల ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలని కోరుతూ చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, అఖిలపక్ష నాయకులు మంగళవారం చేపట్టిన చేర్యాల బంద్‌ విజయవంతమైంది. మండల కేంద్రంలోని దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను స్వచ్ఛందంగా మూసి వేశారు. అఖిలపక్ష నాయకులు కొత్త బస్టాండ్‌ నుంచి గాంధీ చౌరస్తా మీదుగా సినిమా టాకీస్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
     
    అంగడి బజారు వద్ద మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్సై లక్ష్మణ్‌రావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బలవంతంగా తొలగించారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఏన్నో ఏళ్లుగా చేర్యాల ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలపాలని మండల వాసులు కోరుకుంటున్నారని, తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇక్కడి ప్రజల మనోభావాలు గుర్తించకుండా జనగామ జిల్లాలో కలపాలంటూ ప్రతిపాదనలు ఇవ్వడం సరైంది కాదని విమర్శించారు.
     
    తన నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో నాయకులు పందిళ్ల నర్సయ్య, ఉడుముల భాస్కర్‌రెడ్డి, పబ్బోజు విజేందర్, పుర్మ వెంకట్‌రెడ్డి, మహాదేవుని శ్రీనివాస్, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, అందె అశోక్, కందుకూరి సిద్దిలింగం, తడ్క లింగమూర్తి, వైస్‌ఎంపీపీ బత్తిని జ్యోతిశ్రీనివాస్, సర్పంచులు ముస్త్యాల అరుణ, పెడతల ఎల్లారెడ్డి, సూటిపల్లి బుచ్చిరెడ్డి, వంగ రాణి, ఎంపీటీసీలు కొమ్ము నర్సింగరావు, బందెల మహిపాల్‌రెడ్డి, బొమ్మగోని రవిచందర్, ఆత్కూరి కనకలక్ష్మి, జయరాములు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు