మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం

2 Jul, 2017 04:40 IST|Sakshi
మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నం
బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు 
రాజానగరం : మద్యం మత్తు మనిషిని ఎంతటి ఘాతుకానికైనా ప్రేరేపిస్తుంది. ఎదుటి వారి ప్రాణాలు తీయడానికైనా, తనను తాను చంపుకోవడానికైనా వెనుకాడరు. రాజానగరంలోని గాంధీ బొమ్మ సెంటరులో ఈ తరహా ప్రయత్నమే చేశాడో యువకుడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి చేర్చి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. 
ఎక్కడ నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో తెలియదు, సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువకుడు శనివారం 2.30 గంటల ప్రాంతంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకున్నాడు. పక్కనే ఉన్న ఓ దుకాణంలో నాలుగు బ్లేడ్లు కొని, సెంటరులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని, ఆ బ్లేడ్లతో తన పీక కోసుకోవడంతో ఆ పరిసరాల్లో ఉన్న వ్యాపారులు, ప్రయాణికులు బిత్తరపోయారు.  అడ్డుకునేందుకు దగ్గరకు వెళ్లబోతే కారుతున్న రక్తాన్ని దోసిళ్లతో పట్టి వాళ్లు రాకుండా రోడ్డు పైకి చిమ్మేవాడు. మాది ఉండ్రాజవరం (పశ్చిమ గోదావరి జిల్లా), నన్ను మా వాళ్లు మోసం చేశారు, బతకనివ్వరు..అని అంటుండేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంతలో స్థానికులు విషయాన్ని 108కి, పోలీసులకు చేరవేశారు. 108 రావడం ఆలశ్యమైనా ఎస్సై రాజేష్, తన సిబ్బందితో   అక్కడకు చేరుకుని, ఆత్మహత్యప్రయత్నం చేస్తున్న ఆ యువకుడిని పట్టుకుని, ఆటోలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఎస్సై తెలిపారు.  
సారా ఇస్తారా.. చావమంటారా?
బ్లేడుతో పీక కోసుకుని ప్రాణాపాయ స్థితిలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన చోరా సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. స్పృహలోకి వచ్చిన అతడి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. బుడబుక్కల తెగకు చెందిన  అతడు కుటుంబ సభ్యులతో కలసి విజయనగరం వరకు సంచారం చేస్తుంటాడు. ప్రస్తుతం రాజానగరం మండలం, కలవచర్లలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. తాగుడుకు బానిసై, ఈ విధంగా తయారయ్యాడని వారు తెలిపారు. స్పృహలోకి వచ్చిన సుబ్రహ్మణ్యం తనకు వెంటనే ఒక నైంటీ లేదా సారా పోయాలంటూ పోలీసులను, వైద్యులను డిమాండ్‌ చేస్తున్నాడు. పీక కోసుకున్నావ్‌ గుటక వేయలేవురా అంటే సెలైన్‌లో పోసి ఎక్కించండి, లేకపోతే నాకు మత్తు ఎక్కదంటున్నాడు. మద్యం మత్తుకు బానిసైన వారి పరిస్థితి ఏస్థాయిలో ఉంటుందో నిరూపిస్తున్నాడు.
మరిన్ని వార్తలు