పిట్టంత సాయం

28 Feb, 2016 03:04 IST|Sakshi
పిట్టంత సాయం

ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. మూగజీవాల వెతలు
నీటి సౌకర్యం అందించాలంటున్న జంతు, పక్షి ప్రేమికులు
ప్రతిఒక్కరూ పర్యావరణ బాధ్యతగా గుర్తించాలని ప్రచారాలు

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎండలు మండుతున్నాయ్.. గొంతుకలు ఎండుతున్నాయ్.. మనుషుల సంగతే ఇలా ఉంటే ఇక పక్షులు, జంతువుల సంగతేంటి? భానుడి ఉగ్రరూపానికి మూగజీవాలకు పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. వర్షాలు లేక చెరువులు, కుంటలు, వాగులు ఎండి.. మంజీర సైతం నై చాచింది. ఇప్పటికే పగటి ఊష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరింది. ఇక ఏప్రిల్, మేలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది. ఈ సమ్మర్‌లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో నీళ్లు దొరక్క వేలకొద్ది జీవజాలం మృత్యువాత పడే ప్రమాదం ఉందని పక్షిప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్, మేలో రామాయంపేట, నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో వందల కొద్ది నెమళ్లు నీళ్లు లేక మృత్యువాత పడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఇరాన్ దేశం నుంచి వచ్చిన డక్సీ పక్షులు, నీటికొడి, నల్లకొంగలు లాంటి అరుదైన పక్షు జాతులు పూర్తిగా అంతమొందే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ‘జీవ సమతుల్యత’ దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రతిఒక్కరూ ముందడుగా వేయాలని పిలుపునిస్తూ ‘సాక్షి’ అందిస్తున్న ‘పిట్ట’కథనం..

గండం గట్టెక్కిద్దాం
పక్షులను ఈ గండం నుంచి గట్టెక్కించడం మనుషులుగా మన బాధ్యత. కొద్దిపాటి మానవత్వం చూపితే పక్షి జాతులను కాపాడుకోవచ్చు. పల్లెలు, పట్టణాలు, తండాల్లో ప్రజలు ఇంటి సమీపంలో మట్టి పాత్రల్లో కొద్దిగా నీళ్లు నింపి పెడదాం. బోర్లు, బావుల్లో నీళ్లున్న రైతన్నలు కనీసం వారానికి ఒక సారైనా ఐదు నిమిషాల పాటు మోటారు పెట్టి నీటి గుంత నింపితే మూగజీవాల దాహార్తిని తీర్చినవారవుతారు. అటవీశాఖ అధికారులు అడవుల్లో బోర్లు వేయించి, చెక్ డ్యాంలు, సాసర్ ఫీట్లు ఏర్పాటు చేసి వాటి నిండా నీళ్లు నింపితే పక్షులు, జంతువులు గండం నుంచి బయటపడుతాయి. ప్రస్తుతం ఫారెస్టు అధికారులు పార్కులు, అభయారణ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ఓపెన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సైతం సాసర్లలో నీళ్లు నింపాల్సిన అవసరం ఉంది.

 ఈ పక్షులకు ఎవరు చెప్పారో...
సైబీరియా ప్రాంతం నుంచి ఏటా జిల్లాకు పెలికాన్ పక్షులు వలస వచ్చేవి. పోచారం అభయారణ్యం, కల్పగురుతో పాటు మంజీరా పరిసర గ్రామాల్లోని చెట్ల మీద, చెరువుల్లో సేద తీరేవి. సైబీరియా మనకు దాదాపు 3,500 మైళ్ల దూరం. డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కాని వచ్చి గుడ్లుపెట్టి, పిల్లల్ని పొదిగి జూన్‌లో తిరిగి సైబీరియా వెళ్లిపోయేవి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ విదేశీ అతిథిలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, మన మెతుకుసీమలో కరువు ఉందని ఎవరు చెప్పారో? ఏమో..! ఈ ఏడాది పెలికాన్ పక్షులు రాలేదు. కరువు ఛాయలను ముందే పసిగట్టిన రాకపోయి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఓ డాక్టర్ చెతన్యం
డాక్టర్ చైతన్య, మనూరు మండలం వెటర్నరీ డాక్టర్.. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ‘పక్షులకు మట్టి పాత్రలో నీళ్లు పెడదాం’ అనే నినాదం తె చ్చారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఇంటి పైన మట్టిపాత్రలో నీళ్లు పెట్టించి వందలాది పావురాల ప్రాణాలు కాపాడారు.  ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించగా చెప్పిన మాటలు...‘పట్నంలో కంటే పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది పక్షుల పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. పక్షులు మనకెంతో మేలు చేస్తున్నాయి. వాటి మనుగడ కోసం నేను చిన్న ప్రయత్నం మొదలుపెట్టా. రైతులు, సామాన్యులు ఎవరైనా సరే మీ ఇంటి మీద, లేదా ఇంటి ముందు చిన్న మట్టి పాత్రలో నీళ్లు పెట్టండి. పక్షులు వాటితో దాహం తీర్చుకుంటాయి’ అని అన్నారు.

‘గూడు’ వదిలేశామా?
నాగరికం మోజులో జనం మానవత్వం మరిచిపోయారు. కాంక్రీట్ జంగల్‌లో భార్యాపిల్లలకు మినహా మిగిలినవారికి చోటు కల్పించలేనంత సంకుచిత స్వభావానికి అలవాటుపడ్డారు. అయితే, చిన్నప్పుడు మనం చేసిన చిరుసాయం ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. ఇంటి మీద గూళ్లు ఏర్పాటు చేసేవాళ్లం. అంతేకాదు పక్షులు ఇంటిపై వాలడాన్ని శుభసూచకంగా భావించేవాళ్లం. ఇంటి నిర్మాణ సమయంలోనే ఊర పిచ్చుకల కోసం గూళ్లు సిద్ధపరిచేవాళ్లం. ఇంటి సూరుకు నలువైపుగా చెక్క ముక్కలతో గూళ్లు నిర్మించేవాళ్లం. అంతేకాదు మూడు చెక్క ముక్కలను త్రిభుజం ఆకారంలో పేర్చి దానిపై ఇంటి పైకప్పు వేసేవాళ ్లం. ఈ సందుల్లో పిచ్చుకలు గడ్డి, పీచు లాంటి వాటితో గూడు అల్లుకునేవి. అందులోనే గుడ్లుపెట్టి పిల్లలు చేసేవి. రెక్కలు వచ్చే వరకు అక్కడే ఉండేవి. ఒక్కసారి పొదిగిన గూటికి పిచ్చుక మళ్లీ రాదు. కాబట్టి పిల్ల పిచ్చుకలు ఎగిరిపోయిన తర్వాత ఇంటి యజమాని పాత గూడును తీసేసి మళ్లీ కొత్త తరం పక్షులను ఆహ్వానించేవాడు...

 

మరిన్ని వార్తలు