అబ్బుర పరిచే ‘హేమావతి’

3 May, 2017 23:40 IST|Sakshi
అబ్బుర పరిచే ‘హేమావతి’

అమరాపురం మండలంలోని హేమావతి గ్రామం పేరు వినగానే 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఈ ఆలయం అందాలను అక్కడికెళ్లి చూడాల్సిందే. 8వ శతాబ్దంలో నొళంబులు పాలిస్తున్న సమయంలో నిర్మితమైన ఈ ఆలయంలోని ప్రతి స్తంభాన్ని ప్రత్యేక శ్రద్ధతో చెక్కారు. స్తంభాలపై శిల్పాలు అబ్బుర పరుస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా సిద్దేశ్వర స్వామి మూలవిరాట్‌ లింగాకారంలో కాకుండా మానవరూపంలో దర్శనమిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి అరుదైన ఆలయం మరెక్కడా లేదు. ఆలయ ఆవరణంలో దొడ్డేశ్వరస్వామి శివలింగాకారంలోను, దీనికి ఎదురుగా ఐదు అడుగుల ఎత్తు ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తారు.

అలాగే కాలభైరవేశ్వర, పంచలింగేశ్వర ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు సువిశాలమైన పార్క్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. భక్తులకు అన్నదాసోహ కేంద్రంలో అన్నదానం చేస్తుంటారు. రోజూ ఉదయం ఐదు నుంచి సాయంత్రం 8 గంటల వరకూ పూజలు చేస్తుంటారు. ఈ ఆలయానికి సందర్శించాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి పెనుకొండ, మడకశిర, బసవనపల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు. లేదంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లిగేట్‌ మీదుగా 120 కి.మీ ప్రయాణించి అమరాపురం, ఇక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది. ప్రతి రోజూ అమరాపురం నుంచి ఆటోలు, బస్సులు హేమావతికి వెళుతుంటాయి.
- అమరాపురం (మడకశిర)

మరిన్ని వార్తలు