ఉపాధికి ‘ఉపశమనం’

30 Mar, 2016 02:54 IST|Sakshi
ఉపాధికి ‘ఉపశమనం’

వేసవి నేపథ్యంలో పనివేళల్లో మార్పు
ఎండ తీవ్రత పెరగకముందే పనులు పూర్తి
సాయంకాలమూ పని చేసుకునే వెసులుబాటు
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మార్పులు
కొత్త పనివేళలు నేటినుంచి అమల్లోకి..

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఉపాధిహామీ కూలీలకు శుభవార్త. వేసవి తాపంతో అల్లాడిపోతున్న కూలీలకు ఉపాధి పనివేళలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు.

 తాజాగా ఎండలు మండిపోతుండడం కూలీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వైఖరిని తీవ్రంగా పరిగణించి పనివేళలు మార్చాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పనివేళల మార్పు నిర్ణయాన్ని తీసుకుంది. బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 గంటల నుంచి 6గంటల వరకు ఉపాధి పనులు చేపట్టాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లను ఆదేశించింది.

 క్షేత్రస్థాయి అధికారులకు ఎస్‌ఎంఎస్‌లు..
జిల్లాలో 33 గ్రామీణ మండలాలకు గాను 25 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ మండలాల్లో 2,89,885 జాబ్ కార్డులు జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు సగటున 62 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జనవరి నెలలో రోజుకు లక్ష మంది హాజరుకాగా.. తాజాగా ఎండల తీవ్రత పెరగడంతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనుల వేళలను ప్రభుత్వం మార్చింది. బుధవారం నుంచి కొత్త పనివేళలను అమలు చేయాలంటూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ క్షేత్రస్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని అందజేశారు. ఉదయం వేడి తీవ్రత తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయితే సాయంత్రం వేళలో కూలీల హాజరు తగ్గుతుందని డ్వామా అధికారులు చెబుతున్నారు.

 బకాయిల భారంతోనూ..
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా కూలీ డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిధులను సర్దుబాటు చేయలేదు. ఫలితంగా రెండు నెలలుగా కూలీలకు డబ్బుల పంపిణీ స్తంభించింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మంది కూలీలకు రూ.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూలీ డబ్బులు చెల్లించని కారణంగా ఉపాధి పనులకు కూలీల హాజరు తగ్గుతోంది. మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. పలువురు పీడీలు ఈ అంశాన్నే ప్రస్తావించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ రెండ్రోజుల్లో నిధులు విడుదలవుతాయని.. కూలీలకు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు