పగలు ఎండ.. రాత్రి చలి

18 Oct, 2016 00:52 IST|Sakshi
పగలు ఎండ.. రాత్రి చలి
అనంతపురం అగ్రికల్చర్‌ : విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో నెలకొన్న విపరీత వాతావరణ పరిస్థితులు ఖరీఫ్, రబీ పంటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 110.4 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 17 రోజుల తర్వాత కూడా కేవలం 7 మిల్లిమీటర్లే నమోదైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోపాటు అల్పపీడనం, వాయుగుండం లాంటి వాటి వల్ల వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో వరుణుడు మొహం చాటేయడం వల్ల రబీ సాగు పడకేసింది. పప్పుశనగ, వేరుశనగ, ఇతర రబీ పంటలు సాగు చేసే రైతుల్లో ఆందోళన నెలకొంది. 1.50 లక్షల హెక్టార్లకుగానూ ప్రస్తుతానికి కేవలం 30 వేల హెక్టార్లలో రబీ పంటలు సాగులోకి వచ్చాయి. అలాగే ఖరీఫ్‌లో వేసిన కంది, ఆముదం, పత్తి, పెసర లాంటి పంటల  దిగుబడులు అక్టోబర్‌లో కురిసే వానలపై ఆధారపడి ఉంటాయి. పూత దశలో ఉన్న 60 వేల హెక్టార్ల కందికి ఇపుడు వర్షం చాలా అవసరం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి కీలకమైన అక్టోబర్‌లో విచిత్రమైన వాతావరణం నెలకొనడంతో ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
మారిన వాతావరణ గణాంకాలు
గత 15 రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో 32 నుంచి 35 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా ఇపుడు 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగాయి. పగలు ఇలా ఉంటే  నాలుగైదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి పెడుతుండటం విశేషం. గతంలో ఇదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 24 డిగ్రీలు నమోదు కాగా ఇపుడు 18 నుంచి 22 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే రాత్రిళ్లు కాస్త అటుఇటుగా రెండు డిగ్రీల వరకు తగ్గుదల కనిపిస్తోంది. గాలిలో తేమశాతం కూడా ఇపుడు గణనీయంగా పడిపోయింది. గతంలో ఉదయం పూట 80 నుంచి 88 శాతం ఉండగా ఇపుడు 72 నుంచి 80 శాతం మధ్య నమోదవుతోంది. ఉదయం పూట పెద్దగా తేడా లేకున్నా మండే ఎండల ప్రభావంతో మధ్యాహ్న సమయంలో తేమ శాతం బాగా తగ్గుదల కనిపిస్తోంది. గతంలో మధ్యాహ్నం సమయంలో 48 నుంచి 56 శాతం మధ్య ఉండగా ఇపుడు 25 నుంచి 45 శాతానికి పడిపోయింది. గతేడాది అక్టోబర్‌లో 17వ తేదీ నాటికి 88 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కురవాల్సినదాని కన్నా 80 శాతం ఎక్కువ పడింది. ఈ సారి మాత్రం ఇప్పటివరకు కేవలం 7 మిల్లీమీటర్లతో ఏకంగా 90 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడం విషాదకరం. 
మరిన్ని వార్తలు