ఎండ మండుతోంది.. వాన కురుస్తోంది

2 May, 2017 02:16 IST|Sakshi
నరసాపురం : వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుఉన్నాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. వారం రోజులుగా కొన్నిచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచీ భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులు, అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా మే నెలాఖరు నుంచి (రోహిణి కార్తె వెళ్లాక) ఈదురు గాలులు వీయటం.. వర్షాలు కురవటం పరిపాటి. అందుకు భిన్నంగా ఏప్రిల్‌ చివరి వారం నుంచే భారీ గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 
ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమే ఈ మార్పులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటివరకూ 35నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కడం, సాయంత్రం చల్లబడుతుండటంతో భూమి నుంచి వేడి వాయువుల పీడనం పైకి వెళుతోంది. ఈ కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తు న్నాయి. వాతావరణంలో నెలకొన్న ఈ సర్దుబాట్లే ప్రస్తుత స్థితికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే గాలుల్లో వేగం పెరగడం ఈదురు గాలులకు కారణమని చెబుతున్నారు.
తగ్గుతున్న తేమశాతం
తీర ప్రాంతం కావడంతో మన జిల్లాలో తేమ శాతం అధికంగా ఉంటుంది. నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. పగటిపూట తేమశాతం 60 నుంచి 70 శాతానికి తగ్గింది. రాత్రివేళ 80 నుంచి 90 శాతం నమోదవుతోంది. వారం క్రితం వరకు పగటిపూట 70 నుంచి 80 తేమ శాతం నమోదైంది. తగ్గుతున్న తేమ శాతంలోను గంటకో రకంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీనివల్ల ఉక్కపోత కాస్త తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
విజృంభిస్తున్న వ్యాధులు
రోజుల వ్యవధిలో  తేమ శాతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ బళ్ల మురళి సూచించారు.
 
వారం రోజులు ఇదే పరిస్థితి
నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భూమి బాగా వేడెక్కింది. వాతావరణం చల్లబడ్డ తరువాత వచ్చే వేడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడి వర్షిస్తున్నాయి. దీనికి ఈదురు గాలులు తోడయ్యాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. 
– ఎన్‌.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం
 
>
మరిన్ని వార్తలు