ఖరీఫ్కు సన్స్ట్రోక్!

13 Jul, 2016 04:18 IST|Sakshi

పంటల సాగుకు కరుణించని వరుణుడు
ఎండ, వడగాడ్పులకు సాగు చేసిన పైర్లు సైతం ఎండుముఖం
విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఆందోళనలో అన్నదాతలు

జూలై మాసం.. రైతన్నకు ఎంతో కీలకం. జూన్ నెల సగంలోనే నైరుతీ రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూలై నెలంతా పంటల సాగులో అన్నదాతలు బిజీబిజీగా ఉంటారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం పరుగులు తీస్తుంటారు. కానీ, ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా ఆ హడావిడి కనిపించడం లేదు. తొలకరికి ముందే మండుటెండల్లో వచ్చిపోరుున వరుణుడు.. రుతుపవనాలు వచ్చినాగానీ మొహం చాటేశాడు. జూలై నెల సగం గడిచిపోతున్నా.. జిల్లాపై కనికరం చూపడం లేదు. పైగా, భానుడి ప్రతాపం, వడగాడ్పులు వెరసి ఇప్పటికే సాగుచేసిన పంటలను ఎండుముఖం పట్టిస్తున్నారుు. అన్నదాతకు నిద్ర లేకుండా చేస్తున్నారుు.

ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సన్‌స్ట్రోక్ తగులుతోంది. వర్షాలు కురవాల్సిన సమయంలో వేడిగాలులతో రైతులకు షాక్ కొడుతోంది. వరుణుడి దోబూచులాటకుతోడు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం పంటలపై పగతీర్చుకుంటూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నారుు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులైనా.. నేటికీ సక్రమంగా వర్షాలు కురవలేదు. అరకొరగా సాగుచేసిన లేతపైర్లు సైతం ఈదురుగాలులు, వడగాడ్పులతో విలవిల్లాడుతున్నాయి. గత రెండేళ్ల కరువు పరిస్థితులు ఈ ఏడాది కూడా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కొత్తగా పంటల సాగు సంగతి అటుంచితే.. ఇప్పటికే వేసిన పంటలైనా చేతికొస్తాయో లేదోనని రైతులకు బెంగపట్టుకుంది.

 2,35,857 హెక్టార్లకుగానూ 27,500 హెక్టార్లలోనే సాగు...
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలదాటింది. ప్రారంభంలో ముందస్తుగా మురిపించిన వర్షాలు పంటల సాగుపై రైతులకు ఆశలు పెంచారుు. అన్నదాతలు వెంటనే పలు రకాల పంటలు సాగుచేశారు. కానీ, అనంతరం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు చతికిలపడింది. ప్రస్తుత సీజన్‌లో 2,35,857 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 27,500 హెక్టార్లలో సాగయ్యూరుు. వరి 32,185 హెక్టార్లకుగానూ 20 హెక్టార్లలోనే సాగైంది. జొన్న 220 హెక్టార్లకుగానూ అసలు సాగుకే నోచుకోలేదు. సజ్జ 17,030 హెక్టార్లకుగాను కేవలం 600 హెక్టార్లలోనే సాగైంది. రాగి, మొక్కజొన్న, అలసంద, సొయాచిక్కుడు పంటల సాగు ఎక్కడా కనిపించడంలేదు.

 సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరం...
ఖరీఫ్‌లో పూర్తిస్థారుులో పంటల సాగు సంగతి అటుంచితే, సాగుచేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెసర 4,145, మినుము 600, కంది 1,191, వేరుశనగ 1,661 హెక్టార్లలో సాగుచేశారు. 4,579 హెక్టార్లకుగానూ 8,856 హెక్టార్లలో భారీగా నువ్వు సాగుచేశారు. ఈ సీజన్‌లో 6,008 హెక్టార్లకుగాను కేవలం 485 హెక్టార్లలోనే కూరగాయలు సాగు చేశారు. జీలుగ కూడా మరో 100 హెక్టార్లలో సాగైంది. సాగుచేసిన పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పంటలు పూత, కాయ దశలో ఉండగా, వర్షాలు లేక ప్రతికూల పరిస్థితులు వాటిని వేధిస్తున్నారుు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో వడగాడ్పులు, ఎండలకు తోడు విద్యుత్ అంతరాయంతో సాగునీటి కష్టాలు పంటలను నాశనం చేస్తున్నారుు.

 తీరప్రాంతంలో ఎండుతున్న వేరుశనగ...
జిల్లాలోని తీరప్రాంతంలో ఇప్పటికే విస్తారంగా సాగైన వేరుశనగ వడగాడ్పుల దెబ్బకు విలవిల్లాడుతోంది. తరచూ విద్యుత్ అంతరాయంతో బోర్లు సైతం పనిచేయక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈదురుగాలుల దెబ్బకు కరెంటు నిలవకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ కష్టాలు చాలవన్నట్లు అడుగంటిన భూగర్భజలాలతో బోర్లలో నీరు రావడం గగనమవుతోంది. విద్యుత్ మోటార్లు తరచూ మొరాయిస్తున్నారుు. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది.  జిల్లావ్యాప్తంగా రోజూ కారుమబ్బులు.. కటిక చీకట్లు తప్ప.. చుక్క వానపడని పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అరుుతే ఖరీఫ్ పంటల సాగు దాదాపు నిలిచిపోయినట్టు చెప్పాలి. ఎటుచూసినా ఎడారిని తలపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది తీవ్ర కరువు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు