రామప్ప.. రక్షణ లేదప్పా!

13 Jul, 2016 03:23 IST|Sakshi
రామప్ప.. రక్షణ లేదప్పా!

- ఆలయం పైకప్పు నుంచి కారుతున్న వర్షపునీరు
- చారిత్రక సంపదపై అధికారుల నిర్లక్ష్యం
- ఇలాగే వదిలేస్తే ఆలయాలు కూలిపోయే ప్రమాదం
 
 వెంకటాపురం, గణపురం : ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటుతున్నా శిల్పాలు చెక్కుచెదరలేదు. కానీ కొంతకాలంగాఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారలుగా కారుతోంది. దీంతో ఆలయం బీటలు వారుతోంది.

గతంలో ఇలా జరగడంతో 1992లో ఆరు అంగుళాల మందం సిమెంట్‌తో స్లాబ్ వేయించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తిరిగి 2010 నుంచి ఆలయంలో వర్షపు నీరు కారుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో స్పందించిన పురావస్తుశాఖ అధికారులు రామప్ప ఆలయ పైకప్పు పునర్నిర్మాణానికి 2014 డిసెంబర్‌లో ప్రతిపాదనలు పంపారు. దాంతో కేంద్ర ం రూ.23లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో 2015 ఫిబ్రవరి 5న పైకప్పు పునర్నిర్మాణ పనులు ప్రారంభించి.. అంతకు ముందు వేసిన సిమెంట్ పొరను తొలగించారు. తర్వాత తాత్కాలికంగా టార్పాలిన్ కప్పి చేతులు దులుపుకొన్నారు.

తర్వాత ఏడాది కూడా పనులు మొదలుపెట్టినా తూతూ మంత్రంగా పూర్తి చేశారు. తాజాగా ఆలయంలో మళ్లీ వర్షపు నీరు కారుతోంది. దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా ఆలయూన్ని పరిశీలించేందుకు ఎవరూ రాకపోవడం గమనార్హం. ఈ వర్షాకాలం గడిచేవరకు రామప్ప ఆలయంపై మళ్లీ టార్పాలిన్ కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా ఆలయ పైకప్పు నుంచి నీరు కారుతూ చిత్తడిగా మారి.. భక్తులకు ఇబ్బంది ఎదురవుతోంది. పురాతన కట్టడమైన రామప్ప ఆలయ పైకప్పు లీకేజీలు అరికట్టకపోతే ఆలయ శిల్పాలు దెబ్బతింటాయని, ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోవడంతో అభిషేకాల నీరు, శివలింగాన్ని శుద్ధి చేసే నీరు గర్భగుడిలోనే నిలిచి ఇంకిపోతోంది. దీంతో ఆలయంలోని రామలింగేశ్వరుడు ఒకవైపు ఒరిగిపోతున్నాడు. పూజారులు సైతం మహాశివరాత్రి మినహా మిగతా రోజుల్లో చిలకరింపు అభిషేకాలే చేస్తుండడం గమనార్హం. సోమసూత్రం మూసుకుపోవడంతో ఇలా చిలకరింపు అభిషేకాలు చేస్తున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు.
 
 గణపేశ్వరాలయానిదీ అదే దుస్థితి
 వరంగల్ జిల్లా గణపురంలో కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలిచిన గణపేశ్వరాలయంలోనూ వర్షపు నీరు కారుతోంది. నాలుగేళ్ల కింద కేంద్ర పురావస్తు శాఖ నుంచి రూ.2.75 కోట్లు మంజూరైనా దేవాలయం పైకప్పునకు మరమ్మతులు చేయలేదు. ఆ నిధుల్లో నుంచి రూ.75 లక్షలతో హరిత హోటల్ నిర్మించారు. మిగతా నిధులతో ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులకు 2014 ఆగస్టు 8న శంకుస్థాన చేశారు. కానీ ఆ పనులు ముందుకు కదలలేదు. దాంతో ప్రతి వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరుతున్నాయి. శిఖర భాగంలో పగులు ఉండటంతో చిన్న వర్షానికి కూడా దేవాలయం నీటితో నిండిపోతోంది. దీంతో దేవాలయ పరిరక్షణ కమిటీ ఏటా టార్పాలిన్‌లను కొనుగోలు చేసి దేవాలయ గోపురంపై కప్పుతోంది. ఈసారి కూడా ఇటీవలే రూ.16 వేల ఖర్చుతో టార్పాలిన్‌లను కొనుగోలు చేసి కప్పారు. శివలింగానికి పైన రెండు గొడుగులు పెట్టారు.

మరిన్ని వార్తలు