అనాథలకు ఆలయం

21 Aug, 2016 22:29 IST|Sakshi
అనాథలకు ఆలయం
  • చీకటి జీవితాలకు వెలుగు హౄదయశాంతి ఆశ్రమం
  • వృద్ధుల సేవలో ఆనందరావు మమేకం
  • ‘మౌనం యొక్క ఫలితం ప్రార్థన
    ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం
    నమ్మకం యొక్క ఫలితం ప్రేమ
    ప్రేమ యొక్క ఫలితం సేవ
    సేవ యొక్క ఫలితం సంతృప్తి’ కలుగుతుందని సేవామూర్తి మదర్‌థెరిసా చెప్పిన మాటలివి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని పొలమరశెట్టి ఆనందరావు వృద్ధులు, అనాథల సేవలో మమేకమయ్యారు. నాకెవ్వరూ లేరు అనేవారికి ఆప్తుడయ్యారు. కూతురు చూడటం లేదని బోరున విలపిస్తే ఓ తల్లిగా కన్నీళ్లు తుడిచారు. కొడుకు నిర్లక్ష్యానికి చావే శరణ్యమనుకుంటున్న ఓ పెద్దాయనకు తాతలా ఓదార్చారు. మీ అందరికీ నేనున్నానంటూ ‘హృదయం’లో స్థానమిచ్చారు. వృద్ధులకు తల్లిగా..తండ్రిగా..స్నేహితుడిగా మారారు. హృదయశాంతి ఆశ్రమం స్థాపించి సేవామూర్తిగా మారారు.  –అనకాపల్లి రూరల్‌
     
     ఆనందరావు సొంత ఊరు కొత్తవలస వద్ద మంగళపాలెం. ట్రెజరీ అధికారిగా అనకాపల్లిలో ఎక్కువ కాలం సేవలందించారు. 2000 సంవత్సరంలో వలంటిరీ రిటైర్మెంట్‌ తీసుకుని వృద్ధాశ్రమం స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించారు. ఎక్కడెక్కడినుంచి వచ్చిన వారంతా ఒక పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల్లా మారిపోయారు. చివరిమజిలిలో ఆనందరావును ఆ దేవుడే మా కోసం పంపాడని ఆనందబాష్పాలతో చెబుతున్నారు.
    మనస్ఫూర్తిగా చేయాలి...
    ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అందుకే ఉద్యోగానికి వలంటిరీ రిటర్మెంట్‌ ఇచ్చేసి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకూ అదే స్ఫూర్తిగా సేవచేస్తున్నాను. వృద్ధాశ్రమంలో 32 మంది ఉన్నారు. సరైన భోజనం, నిద్రించేందుకు మంచి గదులు, అడగడుగునా జాగ్రత్తలు, బాత్‌రూం సౌకర్యం, నడవలేని వారికి సాయం చేసేవారు ఉన్నారు. ప్రతి రోజూ ప్రార్థన చేసుకునేందుకు మందిరం, కమ్యూనిటీ హాలు ఇలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు సెటిల్‌ అవడంతో ఆనందరావు భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో సేవలందిస్తున్నారు. 
     
    ప్రత్యక్ష అనుభవంతోనే... 
    కొత్తవలస సమీపంలోని మంగళపాలెం గ్రామంలో జన్మించాను. గతంలో మా నాయనమ్మకు ఇదే పరిస్థితి రావడంతో అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆమె ఎన్నో బా«ధలు పడి, ఉన్నవాళ్లవద్ద ఇమడలేక, బయటకు వెళ్లలేక నరకం అనుభవించింది. ఉద్యోగరీత్యా స్థిరపడటంతో అలాంటి వాళ్లకు ఏదో విధంగా సేవ చేయాలన్న సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. ఆశ్రమానికి  దాతలు, గ్రామస్తులు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారు. వీరే లేకపోతే నా సంకల్పం నెరవేరేదికాదు. 
                                                                            -  పొలమరశెట్టి ఆనందరావు, ఆశ్రమ వ్యవస్థాపకుడు .
     
    ఆత్మీయులు ఇక్కడే ఉన్నారు
    కుటుంబసభ్యులు చూడలేని పరిస్థితి కారణంగా ఈ ఆశ్రమానికి రావాల్సివచ్చింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నా బాధలన్నీ మరిచిపోయి ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాను. కన్నవారు లేకపోయినా ఓదార్చే వ్యక్తులు ఉండడం వలన ఉండగలుగుతున్నాను. 
                                                                                                    – కరణం నిర్మల, తుమ్మపాల
     
    ఆశ్రమంలో అన్ని దక్కాయి...
    అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బయటకు పంపేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ ఆశ్రమానికి వచ్చా. ఆశ్రమంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎంతో హాయిగా ఉంటున్నాను. బాగా చూసుకుంటాను, రమ్మని నా కొడుకు పిలిచినా ఇప్పుడు వెళ్లను. వృద్ధాశ్రమం దేవాలయంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాను.
                                                                       –సర్వలక్ష్మి, విజయరామరాజుపేట, అనకాపల్లిపట్టణం
     
    ఇంటి కన్నా ఆశ్రమమే బాగుంది
    ఇంట్లో నా కుటుంబసభ్యుల మధ్య ఉన్నప్పుడు ఎంతో నరకం  చూశాను. సరైన వసతి, తిండి వంటి సౌకర్యాలతోపాటు ముఖ్యంగా ప్రశాంతత వంటివి లేక ఎంతో ఇబ్బందులు పడ్డాను. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయాయి. మంచి భోజన సదుపాయం, మనశ్శాంతి కోసం ప్రార్ధనామందిరంతో ఏ చీకూ చింత లేకుండా ఆనందంగా ఉన్నాను.
                                                                                                           – పార్వతమ్మ, వృద్ధురాలు.
     
    కన్నోళ్లు చేయనివన్నీ ఆశ్రమం కల్పిస్తోంది
    కొడుకు, కోడలు చూడక ఇంత దూరం వచ్చాను. ఈ ఆశ్రమంలో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను. అన్నిసౌకర్యాలు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు.  కన్నవాళ్ల గురించి మాట్లాడే కన్నా ఆశ్రమం గురించి ఎక్కువ మాట్లాడాలనిపిస్తోంది. ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. కన్నోళ్లు చేయని పరిస్థితి ఈ ఆశ్రమం చేస్తోంది. 
                                                                                            –గోపాలరావు, వృద్ధుడు
     
మరిన్ని వార్తలు