‘చైర్మన్‌గా గంగన్నకే మద్దతు’

14 Apr, 2017 23:45 IST|Sakshi

పుట్టపర్తి టౌన్‌ : పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్‌ పీఠం మార్పుపై 4వ వార్డు కౌన్సిలర్‌ బెస్త చలపతి, కొందరు నాయకులు అనవసర రాద్దాంతాన్ని మానుకోవాలని, చైర్మన్‌గా గంగన్నను కొనసాగించడాన్నే సమర్థిస్తున్నామని టీడీపీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. శుక్రవారం పాలకమండలి కౌన్సిల్‌ హాల్‌లో సమావేశమైన కౌన్సిలర్లు పీసీ గంగన్నకు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు లేని పోని మాటలు చెప్పి పల్లెను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నగర పంచాయతీలో మూడేళ్లుగా అభివృద్ది పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా ఆ నాయకులు ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని, లేక పోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి పల్లె, టీడీపీ పెద్దలు నగరపంచాయతీ చైర్మన్‌ మార్పు విషయంలో కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరో కౌన్సిలర్‌ షకీల సైతం ఇదే విషయాన్ని ఫోన్‌లో తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీవీ సుభాషిణి, సుబ్బమ్మ, చెన్నక్రిష్ణమ్మ, ఆదినారాయణమ్మ, దిల్‌షాద్‌షేక్, శ్రీరాంనాయక్, కళావతి, శివలక్ష్మి, నాయకులు బీవీ ప్రసాద్, మహమ్మద్‌ రఫీ, రాజప్ప, సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు