సురక్షిత రక్త సేకరణలో మేలకువలు పాటించండి

23 Jul, 2016 22:19 IST|Sakshi
సురక్షిత రక్త సేకరణలో మేలకువలు పాటించండి

సురక్షిత రక్త సేకరణలో మేలకువలు పాటించండి

తిరుపతి మెడికల్‌ : ప్రాణప్రాయ స్థితిలోని రోగికి రక్తం అందించడం చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన  రక్త సేకరణ, పంపిణీలో సరైన మెళుకువలను పాటించాలని తిరుపతి రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సిద్దా నాయక్‌ వైద్య సిబ్బందికి సూచించారు. రోగులకు ‘సురక్షిత రక్తం సేకరణ,పంపిణీ ’ అనే అంశంపై తిరుపతిలోని ఓ ప్రయివేట్‌ హోటల్లో శనివారం వైద్యులు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని బ్లడ్‌ బ్యాంక్‌ వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్, నర్సులకు అవగాహన సదస్సును నిర్వహించారు. తిరుపతిలోని రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ మోడర్న్‌ బ్లడ్‌ బ్యాంక్‌ (రుయా ఆసుపత్రి) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు ఆగస్టు 24వ తేది వరకు దశల వారీగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా శనివారం నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్, క్యాథలిక్‌ హెల్త్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త సహకారంతో ప్రారంభించిన ఈ సదస్సులో రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్దానాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రక్తం సేకరణ, తిరిగి రోగికి రక్తాన్ని పంపిణీ చేసే సమయంలో వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్, నర్సులు తీసుకోవాల్సిన మెళుకువలపై ఆయన విశదీకరించారు.  రుయా పెథాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌ కృష్ణ, మరో ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనురాధ మాట్లాడుతూ రక్త సేకరణలో  ఏమాత్రం ఏమరు పాటు వ్యవహరించినా ఓ నిండు ప్రాణం బలికావాల్సి వస్తుందన్నారు. తిరుపతిలోని మోడర్న్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.ఎవరైనా సరే రక్తం నిల్వ, కావాల్సిన వారు www.health4all.online సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఏసీఎస్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజరు లలిత, క్యాథలిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు