అగ్రనేతల లొంగుబాటు యోచన అవాస్తవం

4 Jul, 2013 05:36 IST|Sakshi
 పాడేరు, న్యూస్‌లైన్: మావోయిస్టు అగ్ర నేతలు గణపతి, సుదర్శన్, రామకృష్ణ అనారోగ్యానికి గురై లొంగిపోయేందుకు యోచిస్తున్నారనే ప్రభుత్వ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ప్రతాప్ కోరారు. ఈ మేరకు స్థానిక విలేకరులకు ఒక ప్రకటన పంపారు. ఇంటెలిజెన్స్ సంపాదించిన కీలక సమాచారం పేరుతో కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రచురించాయన్నారు.
 
పార్టీ అగ్ర నేతలు గణపతి, కటకం సుదర్శన్, రామకృష్ణ అనారోగ్యంతో ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో నాయకత్వ లోపం లేదన్నారు. దేశ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ మావోయిస్టు పార్టీ ఎదుగుదలను దేశ భద్రతకు పెనుముప్పుగా ప్రకటించడాన్ని అందరు ఖండించాలన్నారు. గ్రీన్‌హంట్ సైనిక, బహుముఖ దాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయని తెలిపారు. నూతన ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పరిచేందుకు మావోయిస్టు పార్టీ ప్రజా యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తుందని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు