జలవనరులపై సర్వే చేయండి

30 Jun, 2017 05:41 IST|Sakshi
జలవనరులపై సర్వే చేయండి

ఆయకట్టు, శిఖం వివరాలు సేకరించాలి
జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి
వీఆర్వో, తహసీల్దార్, ఎంఏవోలకు ఆదేశాలు
కలెక్టరేట్‌లో మండల అధికారుల సమావేశం

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలోని జలవనరులు, వాటి ఆయకట్టు సామర్థ్యం తదితర వివరాలను సర్వే ద్వారా గుర్తిం చాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కృష్ణారెడ్డి మండల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, వీఆర్వోలు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు ఉన్నాయని, ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ జలవనరులు ఉన్నాయో వీఆర్వోలు, తహసీల్దార్లు గుర్తించాలని సూచించారు. ఆయా ట్యాంకులకు ఎంత నీటి సామర్థ్యం ఉంది, దాని చుట్టూ ఎంత ఆయకట్టు ఉందో వివరాలు సర్వే చేసి తీసుకోవాలని పేర్కొన్నారు. చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు, వాగుల పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, అలాంటి వాటిపై దృష్టి సారించి సమగ్ర వివరాలు తెలపాలని వివరించారు. ఒక్కో చోట ఎన్ని నీళ్లున్నాయి.. చుట్టూ ఎన్ని మీటర్ల దూరంలో బోరు వేస్తే నీళ్లు పడతాయి.

. ఆయకట్టు ఎప్పుడు, ఎంత నీటిని విడుదల చేయాలనే అంశాలు ఉండాలని అన్నారు. ఆ వివరాలన్ని ఉంటేనే జిల్లాలో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఆక్రమణల వల్ల వాగులు, కుంటలు, చెరువులు చెడిపోతున్నాయని, శిఖం భూములు లేకుండా పోతున్నాయని, ప్రభుత్వ భూములపై దృష్టి సారించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ జ్యోతిబుద్ధ ప్రకాష్‌ ఈ సమావేశానికి హాజరుకాగా, ఇరిగేషన్‌పై వివిధ అంశాల్లో మండల అధికారులతో చర్చించామని తెలిపారు. త్వరగా సర్వే చేసి వివరాలు అందించాలని కలెక్టర్‌  సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో బానోత్‌ శంకర్, తహసీల్దార్లు అతికొద్దీన్, రాంరెడ్డి, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు