ప్రాణాలు తీసిన మనస్పర్థలు

11 May, 2017 01:12 IST|Sakshi
ప్రాణాలు తీసిన మనస్పర్థలు

ఇద్దరు చిన్నారులతో నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
మూడు మృతదేహాలను గుర్తించిన స్థానికులు
రామిరెడ్డిపాళెంలో  విషాదం


వరదయ్యపాళెం: ఆ తల్లి ఏమాత్రం సర్దుకుపోయినా ఆమెతో పాటు మూడు ప్రాణాలు నిలిచేవి. కానీ క్షణికావేశంతో తొందరపడింది. ఫలితంగా మానసిక స్పర్థ మూడు ప్రాణాలను బలిగొంది. వరదయ్యపాళెం మండలం రా మిరెడ్డిపాలెంలో బుధవారం ఈ విషాద సంఘటన జరిగింది. వివరాలివి.. రామిరెడ్డిపాళెంకు చెందిన కె.శ్రీను, సుప్రియ(29) దంపతులకు ఇద్దరు కుమార్తెలు లోహిత(08), తేజశ్రీ(04). శ్రీను వరదయ్యపాళెంలో చిన్నపాటి దాబా నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఉమ్మడి కుటుంబంలో ఏర్పడిన విబేధాల కారణంగా శ్రీను, అతని సోదరుడు వేర్వేరుగా కుటుంబాలతో గ్రామంలోనే ఉంటున్నారు. మంగళవారం సత్యవేడు సమీపంలో సోదరుడు నిర్వహించిన పొంగళ్లు కార్యక్రమానికి శ్రీను తన పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లి వచ్చాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి భార్య, భర్తల మద్య వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే శ్రీను డాబాహోటల్‌ నిర్వహణకు వరదయ్యపాళెంవెళ్లాడు. మంగళవారం రాత్రి గొడవ నేపథ్యంలో సుప్రియ  బుధవారం ఉదయం 11గంటకర ఇంట్లోనుంచి దుస్తుల మూట చేతపట్టుకుని పిల్లలిద్దరినీ వెంటపెట్టుకుని శివారులోని తామరగుంట నీళ్ల మడుగుకు వెళ్లింది.

ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తామరగుంట వద్దకు వెళ్లి పరిశీలించారు. గట్టున దుస్తులు, చెప్పులు కనిపించాయి. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చి సమీప ప్రాంతాల్లోనూ వెతికారు. ఎంతసేపటికీ ఆచూకీ లభించకపోవడంతో తామర గుంట వద్దకే మళ్లీ వెళ్లి పరిశీలిస్తుండగా మడుగులో నుంచి తల్లీ, బిడ్డల మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. స్థానికులు ఈ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. చిన్నపాటి విషయమేనని తాను భావించి హోటల్‌కు వెళ్లిపోగా ప్రాణాలు తీసుకుందంటూ శ్రీను రోదించాడు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు