సొంతింటి కోసం సై

19 Dec, 2016 23:22 IST|Sakshi
సొంతింటి కోసం సై
వైఎస్సార్‌ సీపీ నేత డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి
లబ్ధిదారులతో కలిసి భారీ ర్యాలీ
అనపర్తి (బిక్కవోలు) : పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఎలాంటి పోరాటమైనా చేపడతామని వైఎస్సార్‌ సీపీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. అనపర్తిలోని ఇందిరానగర్‌ కాలనీ లబ్ధిదారుల గృహాలు నిర్మించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ సందర్భంగా శ్రీతేతలి రామిరెడ్డి, మంగయమ్మ కళావేదిక వద్ద సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా లబ్ధిదారులు తరలివచ్చారు. డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు గృహాలు కల్పించాలన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో స్థలాన్ని సేకరించి, 1,640 మందికి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. అక్కడ పరిస్థితులు నివాసయోగ్యంగా లేకపోవడంతో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. లబ్ధిదారులంతా నిరుపేదలు కావడంతో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇస్తుందని హామీ ఇవ్వగా, 1,240 మంది తమ పట్టాలను తిరిగి గృహనిర్మాణశాఖ కార్యాలయంలో అప్పగించి మూడేళ్లు కావస్తోందన్నారు. ఇప్పటివరకూ కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు గత ప్రభుత్వమే పూర్తి చేసిందని, కేవలం గృహనిర్మాణ శాఖ నిర్మాణాలు చేయాల్సిఉండగా, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. తక్షణం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని, అర్హత కలిగిన వారికి మిగిలిన స్థలంలో గృహాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వంటిమి సూర్యప్రకాష్, చిర్ల వీర్రాఘవరెడ్డి సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణి తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి భారీ సంఖ్యలో లబ్ధిదారులతో కలసి తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ప్రజావాణిలో తహసీల్దార్‌ ఆదినారాయణకు, హౌసింగ్‌ ఏఈ ఈఎస్‌ఎన్‌ మూర్తికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు