స్వైన్‌ఫ్లూ కలకలం

3 Feb, 2017 22:33 IST|Sakshi
  • డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
  • స్వైన్‌ఫ్లూ కాదని నిర్ధారణ   
  • మనుబోలు : మనుబోలులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూతో మృతి చెందాడనే పుకార్లు కలకలం సృష్టించాయి. దీంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ వరసుందరం గురువారం స్థానిక పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వైన్‌ఫ్లూతో మృతి చెందాడని చెబుతున్న స్థానిక ముస్లింపాళెంకు చెందిన ఇమాంబాషా (54) మృతదేహాన్ని పీహెచ్‌సీ వైద్యాధికారి రవి, హెల్త్‌ అసిస్టెంట్‌ కేశవరావు పరిశీలించి బంధువులతో మాట్లాడారు. మృతుడి వైద్యానికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టును పరిశీలించారు. ఇమాంబాషా యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ సెప్టిసీమియా వ్యాధితో మృతి  చెందినట్లు డాక్టర్‌ రవి తెలిపారు.

    డీఎంహెచ్‌ఓ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో స్వైన్‌ ఫ్లూ వ్యాధి సోకే వాతావరణ లేదని తెలిపారు. కొద్ది రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఈ వాతావరణంలో స్వైన్‌ ఫ్లూ వచ్చే అవకాశాలు లేవన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయని, అవి కూడా చెన్నైలో ఉండటం వల్ల వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడా స్వైన్‌ ఫ్లూ బయట పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. స్వైన్‌ ఫ్లూకి ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 8 పడకలతో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధులకు సక్రమంగా హాజరుకాని యూడీసీ సుబ్బయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన డాక్టర్లు వీరప్రతాప్, జెట్టి రమేష్, రవి, సబ్‌యూనిట్‌ అధికారి పూర్ణచందర్‌రావు, ఎంపీహెచ్‌ఈఓ జోసఫ్, సిబ్బంది ఇందిరమ్మ, సుభాషిణి, షరేకా ఉన్నారు.

    జిల్లాలో మరొకరి మృతి
    నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో స్వైన్‌ఫ్లూతో మరొకరు మృతి చెందిన సంఘటన నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో గురువారం జరిగింది. రెండు రోజుల క్రితమే జిల్లాలోని కావలికి చెందిన రాధామోహన్‌రెడ్డి (37) చెన్నైలోని విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన శ్రీకాంత్‌ (35) తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతూ బుధవారం నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మృతి చెందాడు.

మరిన్ని వార్తలు