మూన్నాళ్ల ముచ్చటే..!

19 Mar, 2017 22:43 IST|Sakshi
మూన్నాళ్ల ముచ్చటే..!

– అలంకారప్రాయంగా స్వైపింగ్‌ మిషన్లు
– రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మూలనపడ్డ యంత్రాలు
– వినియోగించని సిబ్బంది..పట్టించుకోని అధికారులు
– సాంకేతిక కారణాలు చూపుతున్న వైనం
– ‘నగదు’కే అలవాటు పడుతున్న పరిస్థితి


నగదు రహిత లావాదేవీల కోసం తెచ్చిన స్వైపింగ్‌ మిషన్లు మూలనపడ్డాయి. ‘యథారాజా తథాప్రజా’ అన్న చందంగా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వాటి వినియోగానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆర్భాటంగా తీసుకొచ్చిన యంత్రాలన్నీ అలంకారప్రాయంగా మిగిలాయి.
- అనంతపురం టౌన్‌

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో నగదు రహిత లావాదేవీలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం స్థిరాస్తి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), నకళ్లు పొందడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్వైపింగ్‌ మిషన్లు పంపిణీ చేసింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రతినిధులు నగదు రహిత లావాదేవీలు ఎలా నిర్వహించాలో సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సాధారణంగా ఈసీ, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి నగదు తీసుకుని రసీదు ఇస్తుంటారు. కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇది జరగడం లేదు. ఫలితంగా కోరుకున్న సమాచారం కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ కష్టాలకు చెక్‌ పెట్టడం కోసం స్వైపింగ్‌ మిషన్లు ప్రవేశపెట్టారు.

ఇవి వినియోగంలో ఉంటే నగదు రహిత లావాదేవీలు జరిపే సమయంలో బిల్లు వస్తుంది. సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న వారికి కంప్యూటర్‌ ఈసీ/నకలు గంటలోగా ఇవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్‌ అయితే 24 గంటల్లోగా అందజేయాలి. నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ ఈసీ గానీ, నకలు గానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే సదరు ఉద్యోగి ప్రతి గంటకూ రూ.10 చొప్పున దరఖాస్తుదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్‌ విషయంలో కూడా 24 గంటల్లోగా ఇవ్వకుంటే రూ.50 ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అయితే సిటిజన్‌ చార్టర్‌ ఎక్కడా అమలవుతున్న పరిస్థితి లేదు. తాజాగా స్వైపింగ్‌ మిషన్లు అందుబాటులోకి తెచ్చినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ‘నగదు’ లావాదేవీలకే ఇష్టపడుతున్నారు. ఇదేమని అడిగితే సాంకేతిక కారణాలు చూపుతున్నారు.

ఈసీ, నకలు కోసం స్వైప్‌ చేస్తే దరఖాస్తుదారుడి సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖాతా (మెయిన్‌ అకౌంట్‌)లో పడుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సంబంధించిన ఖాతాల్లోనే ఈ నగదు పడాల్సి ఉంది. స్వైపింగ్‌ యంత్రాల వాడకం ప్రారంభించిన మొదట్లోనే ఈ సమస్యను గుర్తించిన అధికారులు ఆ తర్వాత ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత దీని గురించే మరచిపోయారు. ఇదే మంచి తరుణం అన్నట్లు నగదు రహితానికి రాంరాం చెప్పగా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు.  ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా స్వైపింగ్‌ మిషన్లను వాడడం లేదు.

మెయిన్‌ అకౌంట్‌లో పడుతోంది  
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీల వల్ల అందరికీ మేలే జరుగుతుంది. పనులు కూడా తొందరగా అవుతాయి. స్వైపింగ్‌ మిషన్లలో స్వైప్‌ చేస్తుంటే ఆ డబ్బు విజయవాడలోని ప్రధాన ఖాతాలోకి వెళ్తోంది. దీని వల్ల అందరికీ సమస్యే. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత తొందరగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా సేవలు అందిస్తున్నాం.
– సులేమాన్, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ

మరిన్ని వార్తలు