టెబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు

17 Jul, 2016 23:13 IST|Sakshi
 విన్నర్లుగా నిలిచిన గౌతంకృష్ణ, శైలునూర్‌ బాషా
గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో మూడు రోజులుపాటు కొనసాగిన రాష్ట్రస్థాయి ప్రథమ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో విజయవాడకు చెందిన శైలు నూర్‌ బాషా 4–3 తేడాతో బీ నాగశ్రావణిపై విజయం సాధించింది. బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన ఏ గౌతమ్‌కృష్ణ 4–2 తేడాతో ఏ. జగదీష్‌పై గెలుపొందాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎల్వీఆర్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విజేతలు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘ కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు ఎన్టీఆర్‌ స్టేడియం అనువుగా ఉందన్నారు. జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ సంఘ అధ్యక్షుడు ఎన్వీ గురుదత్తు మాట్లాడుతూ టోర్నమెంట్‌కు 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ, శాప్‌ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ, సీనియర్‌ రిఫరీ ముక్కామల, ఎన్టీఆర్‌ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి టి. సంపత్‌ కుమార్, ఏపీ టేబుల్‌ టెన్నిస్‌ సంఘ జీవితకాల అధ్యక్షుడు చెంచురామయ్య, జిల్లా టెన్నిస్‌ సంఘ కార్యదర్శి కడియాల ప్రవీణ్‌కృష్ణ, టెన్నిస్‌ సంఘ సభ్యులు పీ రామచంద్ర రావు, రామసీత, కృష్ణపాణి, సురేంద్ర, డిప్యూటీ రిఫరీ పీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు