అద్దెతీసుకొని రోడ్డు పాల్జేశారు..

1 Nov, 2016 21:35 IST|Sakshi
మహామండపంలో మూసిఉన్న దుకాణాలు
మహా మండపంలోని వ్యాపారుల ఆవేదన
 
ఇంద్రకీలాద్రి: ‘ఏడాదికి రూ. 1.70 కోట్లు చెల్లిస్తున్నాం..పుష్కరాల నుంచి ఏ రోజు కూడా బోణీ అయింది లేదు.. కనీసం కొండ కింద దుకాణాలు పెట్టుకునేలా అనుమతించాలని అడిగితే టోల్‌గేటు వద్ద రోడ్డుపై నిల్చుని పూజా సామగ్రి అమ్ముకోవాలని చెబుతున్నారు.. ఇదెక్కటి న్యాయమా’ అంటూ మహా మండపంలోని ఐదో అంతస్తులోని దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాల తర్వాత దుకాణాలను కొండ కింద ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తామని దుర్గగుడి ఈవో పేర్కొనడంతో మూడు రోజులుగా దుకాణ యజమానులందరూ లీజెస్‌ విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు...అయితే అధికారులు మంగళవారం చెప్పిన మాటలు విని దుకాణదారులు షాక్‌కు గురయ్యారు. నెలకు ఒక్కొక్క దుకాణానికి రూ. 40 వేల నుంచి రూ. 70 వేల వరకు చెల్లిస్తూ టోల్‌గేటు వద్ద రోడ్డుపై నిల్చుని పూజా సామగ్రి విక్రయించుకోవాలని సూచించడంతో వారు నివ్వెరపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ తమ దుకాణాలను మూసి వేసి నిరసన తెలిపారు. దుర్గగుడి ఈవో, లీజెస్‌ విభాగం అధికారుల తీరుపై ఎమ్మెల్యే బుద్ధా వెంకన్నను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. 
 
షాపులు మహా మండపంలో.. రాకపోకలు ఘాట్‌ రోడ్డుపై..
ఘాట్‌ రోడ్డులో షాపులు తొలగించాం.. ఇక భక్తుల రాకపోకలు మహా మండపం మీదగానే అని నమ్మించి లక్షల రూపాయల కట్టించుకున్న దుర్గగుడి అధికారులు తమను మోసం చేశారని పలువురు దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా ఘాట్‌ రోడ్డుపై నుంచే భక్తులకు కొండపైకి అనుమతిస్తున్నారన్నారు. కనీసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాపు తీసుకుని కూర్చున్నా పట్టుమని రూ. 100 కూడా అమ్మడం లేదని వాపోతున్నారు. ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తోందని, అధికారుల ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు