విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

19 Sep, 2016 23:52 IST|Sakshi
విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్‌ : ఇంజనీరింగ్‌ విద్యార్థులు మోక్షగుండం విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సూచించారు. మండలంలోని తుఫ్రాన్‌పేట శివారులోని ధృవ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంజనీర్స్‌ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, నైపుణ్యం లేని కారణంగా ప్రైవేట్‌ రంగంలోనూ అవకాశాలు రావడం లేదన్నారు. దీంతో ఎంతో మంది కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ చదివింది కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం కాదని.. విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ రంగంలో రాణించాలని కోరారు.  ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉండాలని, కమ్యూనికేషన్‌ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్‌ పరిధిలో సివిల్స్, గ్రూప్‌–1,2 పరీక్షలకు  వారంలో ఒక రోజు శనివారం శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి కళాశాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. విద్యార్థులు తాగి డ్రైవింగ్‌ చేయవద్దన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడే వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు డీ–అడిక్షన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
 ఎగ్జిబిట్ల ప్రదర్శన
ఇంజనీరింగ్, డిప్లమా ఫైనలియర్‌ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కమిషనర్‌ పరిశీలించారు. వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ కె.పర్వత్‌రెడ్డి, సెక్రెటరీ కె.శశిరేఖ, ప్రిన్సిపాల్‌ బి.శ్రీధర్‌రెడ్డి, వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు