టమాట ధర ఢమాల్‌

4 Aug, 2017 22:07 IST|Sakshi
టమాట ధర ఢమాల్‌
కిలో రూ.80 నుంచి రూ.50కి పడిపోయిన రేటు 
పెరిగిన వంకాయల ధరలు 
 
తాడేపల్లిగూడెం : 
ఠారెత్తించిన టమాటా ధరలు ఆదివారం ఒక్కసారిగా పతనమయ్యాయి. సుమారు నాలుగు వారాల పాటు మార్కెట్‌ను ధరల దరువుతో కుదిపేసిన టమాటాలు సెంచరీ మార్కుకు చేరువయ్యే అంత సీన్‌ క్రియేట్‌ చేశాయి. రూ.80 వద్ద స్థిరంగా ఉండి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి టమాట ఒక్కసారిగా రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.50కు పడిపోయింది. గుత్తగా 25 కిలోల ట్రే ధర రూ.900 రూపాయలకు పతనమైంది. అంతే కాకుండా సరుకులో నాణ్యత లేకపోతే ట్రే ధర రూ.400లే. దీంతో ఈ ప్రభావం రిటైల్‌ మార్కెట్‌పై పడింది. ధరలు మరింతగా దిగివచ్చాయి. కిలో 50 రూపాయలకే సరుకు దొరికింది. ఇదిలా ఉంటే వంకాయలు ధర ఒక్కసారిగా రయ్‌మంది. పది కిలోలు ఏకంగా 400 రూపాయలకు చేరుకుంది. విడిగా కిలో రూ.60కు అమ్మారు. నల్లవంకాయల ధర 40 రూపాయలకు చేరింది. ఆవపాడు నుంచి వచ్చే చిక్కుడు కాయల ధర కిలో 120 రూపాయలు పలికింది. గిద్దలూరు నుంచి వచ్చే చిక్కుళ్ల ధర కిలో 50 రూపాయలుంది. దోసకాయలు కిలో 30, దొండ కాయలు 24, కంద 40, పెండ్లం 30, మిర్చి 50, బీటురూట్,క్యారట్‌ 40రూపాయలకు విక్రయించారు. క్యాప్సికం 80, బీన్స్‌ వంద, క్యాబేజీ 20, చామ 40 రూపాయలకు అమ్మారు. కూరగాయల ధరలలో ఎగుడుదిగుడులు కనిపించాయి. 
 
కర్నూలు ఉల్లి.. ధరలో ఘాటు 
గుత్తా మార్కెట్‌లో క్వింటా రూ.1500
విడిగా మార్కెట్లో కిలో రూ.18
30 టిపిసి 21 : మార్కెట్‌కు వచ్చిన కర్నూలు ఉల్లిపాయలు 
 
కర్నూలు ఉల్లిపాయల సీజన్‌కు ఆదివారం వ్యాపారులు శ్రీకారం చుట్టారు. ముహూర్తాల ప్రకారం వ్యాపారులు లాంఛనంగా కర్నూలు నుంచి ఉల్లిపాయల లారీలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఆదిలోనే కర్నూలు ఉల్లిపాయల ధరలు దడను సృష్టించాయి. క్వింటాలు ధర గుత్త మార్కెట్లో 1500 రూపాయల వరకు పలికింది. విడిగా కిలో ఈ రకం ఉల్లిపాయలు 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వ్యాపారులు అమ్మారు. ప్రస్తుతం మార్కెట్‌ అవసరాలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు తీరుస్తున్నాయి. అవసరాల నిమిత్తం వ్యాపారులు ఉల్లిపాయలను కొనుగోలు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఉల్లిపాయలు కుళ్లిపోయాయి. దీంతో వ్యాపారులు వారం రోజుల క్రితం వరకు తీవ్ర నష్టాలను చవిచూశారు. కిలో పది రూపాయల కంటే కిందకు పెట్టి ఉల్లిపాయలను విక్రయించారు. కర్నూలు సీజన్‌ ప్రారంభం కావడంతో ఉల్లిపాయలు ఇక్కడి మార్కెట్‌కు ఆదివారం నుంచి వస్తున్నాయి. తొలుత క్వింటాలు 1400 రూపాయలు పలికిన ఉల్లిపాయలు ఆ తర్వాత 1500 రూపాయలకు ఎగబాకాయి. సరుకు నాణ్యతను బట్టి ఈ ధర వెళ్లింది. పాత ఉల్లిపాయల ధర క్వింటాలు 1600 నుంచి 1700 రూపాయలు పలుకగా విడిగా కిలో 20 రూపాయలకు విక్రయించారు.  
 
 
 
మరిన్ని వార్తలు