తగ్గని టమోత

16 Jul, 2017 23:35 IST|Sakshi
తగ్గని టమోత
రిటైల్‌లో కిలో రూ.80
 కిలో చిక్కుడుకాయలు రూ.120
 చుక్కలనంటిన కూరగాయలు
తాడేపల్లిగూడెం : ట’మోత’ ఇంకా తగ్గలేదు. కొండెక్కిన టమాటాల ధర దిగిరానంటోంది. డిమాండ్‌కు తగిన సరుకు సరఫరా లేకపోవడంతో ధరలు తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో వీటి ధర 25 కిలోల ట్రే రూ.1,800 పలికింది. విడిగా కిలో రూ.80కి మార్కెట్‌లో టమాటాలు దొరికాయి. వీటికి తోడు అన్నట్టుగా చిక్కుడుకాయలు సై అన్నాయి. నల్లజర్ల మండలం ఆవపాడు నుంచి మార్కెట్‌కు వచ్చే చిక్కుడుకాయలు ధర పదికిలోలు రూ.800 పలికింది. విడిగా మార్కెట్‌లో కిలో రూ.120కి చేరింది. క్యారెట్‌ 40, బీట్‌రూట్‌ రూ.40కు విక్రయించారు. క్యాప్సికం, బీన్స్‌ కిలో రూ.80కు విక్రయించారు. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.40 లభించాయి. బీరకాయల ధర మాత్రం కిలో రూ.40 నుంచి రూ.30కి పడిపోయింది. దొండకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.24, కంద రూ.40, చామ రూ.40, చిలకడదుంపలు రూ.30, దోసకాయలు రూ.16, క్యాబేజీ రూ.16, గోరుచిక్కుళ్లు రూ.24లకు లభించాయి. ములగకాడలు జత రూ.12 చేసి అమ్మారు. మామిడికాయలు జతకు రూ.20 విక్రయించారు. ఘాటెక్కించిన కొత్తిమిర ధర కాస్త దిగివచ్చింది. కిలో రూ.50 లభించగా, విడిగా కట్ట పదిరూపాయలకు విక్రయించారు. పచ్చిమిరప కూడా ఘాటు తగ్గించుకుంది. కిలో విడిగా రూ.50కి దొరికింది. బంగాళాదుంపలు. ఉల్లిపాయలు సాధారణ ధరలకే దొరికాయి.  
 
మరిన్ని వార్తలు