భారతీయతకు ప్రతిబింబం సాహిత్యసదస్సులు

3 Mar, 2017 23:02 IST|Sakshi
భారతీయతకు ప్రతిబింబం సాహిత్యసదస్సులు
ఆధునిక తమిళ–తెలుగుకవితల సారూప్యతా సదస్సులో వక్తలు
యానాం : మనుషులు రోబోలుగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో సాహిత్యసదస్సులు మానవత్వాన్ని ప్రేరేపిస్తాయని, ప్రాంతీయబేధాలు తొలగి భారతీయత ప్రతిఫలిస్తుందని కేంద్రసాహిత్యఅకాడమీ చెన్నై అధికారి ఇళంగోవన్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డాక్టర్‌ సర్వేపల్లిరాధాకృష్ణన్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాలులో ఆధునిక తమిళ–తెలుగు కవితల సారూప్యతా సదస్సు సాహిత్య అకాడమీ సాధారణ మండలి సభ్యులు ఆర్‌ సంపత్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇళంగోవన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్య సదస్సులు ప్రజల మ«ధ్య సహృద్భావాన్ని పెంచడానికి తోడ్పడతాయన్నారు. పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత సాహిత్యంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాహిత్యం చదవడం ద్వారా భాషపైపట్టు సాధించడంతో పాటు దేశంలోని వివిధ రచయితల సాహిత్యాన్ని చదివి దేశసంస్కృతిని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు దాట్ల దేవదానం రాజు కీలకోపన్యాసం చేశారు. అనంతరం జరిగిన మొదటి సమావేశానికి తమిళ తెలుగు పాటల ఒక సారూప్యత అనే అంశానికి అవ్వై నిర్మల అధ్యక్షత వహించారు. అదేవిధంగా తమిళ–తెలుగు దళితపాటలపై ఎన్‌ వజ్రవేలు మాట్లాడుతూ తమిళ తెలుగు దళితసాహిత్యం తదితర అంశాల గురించి వివరించారు. తెలుగు–తమిళ కవిత్వంలో గాంధీ ప్రభావం అనేఅంశంపై పి అమ్ముదేవి ప్రసంగించారు. అనంతరం జరిగిన రెండో సమావేశంలో ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి, జాషువాల కవిత్వాల్లో జాతీయవాద అంశాలు గురించి ప్రముఖకవి, తెలుగువిశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సంజీవరావు మాట్లాడారు. మహాకవి భారతి, గురజాడ అప్పారావు గురించి ధనుంజయన్‌ వివరించారు. మూడో సమావేశానికి కవి దాట్ల దేవదానంరాజు అధ్యక్షత వహించగా తెలుగుకవుల కవితాపఠనం సాగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జయరాజ్‌ డేనియల్, తెలుగుశాఖ అధ్యక్షులు వి భాస్కరరెడ్డి, ముమ్మిడి శ్రీవీరనాగప్రసాద్‌ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు