ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు

14 Dec, 2016 03:52 IST|Sakshi
ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఇచ్చోడ/గుడిహత్నూర్‌: రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్ర తర్వాత ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి ముందుకు రాకపోతే శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఇచ్చోడలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో, గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.

పేదల ఇంటికి చుట్టాలొస్తే పడుకోవడానికి స్థలం లేదని, ఒకే గదిలో చుట్టాలతోపాటు మేకలు, కోళ్లతో ఉంటున్నారని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి రూ.200 కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. యాదాద్రి చుట్టూ కేసీఆర్‌ బంధువుల భూములు ఉండడంతోనే నిధులు కేటాయించారని ఆరోపించారు. పాదయాత్రలో జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, నాయకులు జాన్‌వెస్లీ రమ, నైతం రాజు, మల్లేశ్, లింగల చిన్నన్న పాల్గొన్నారు.

పాదయాత్రపైకి దూసుకొచ్చిన లారీ
ఆదిలాబాద్‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనసాగిస్తున్న మహాజన పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాదయాత్ర మంగళవారం నేరడిగొండ నుంచి ఆదిలాబాద్‌కు బయల్దేరింది. ఇచ్చోడ మండలం గాంధీనగర్‌కు చేరుకోగానే వెనుక నుంచి కార్యకర్తలపైకి లారీ దూసుకొచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కార్యకర్తలు భీంరావు, ప్రసాద్, ఎండీ జలాల్‌కు గాయాలయ్యాయి. కాగా, వీరభద్రం ముందు నడుస్తుండడంతో ప్రమాదం బారిన పడలేదు. గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని వార్తలు