అందుకే శపథాలు మానేశా..!

16 Aug, 2015 08:59 IST|Sakshi
అందుకే శపథాలు మానేశా..!

నరసాపురం : సినిమా... అంటే గ్లామరస్ ప్రపంచం. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించాలని తాపత్రయ పడేవారే ఎక్కువ. పెద్దరికాన్ని ఆపాదించుకోవడానికి అసలు ఇష్టపడని లోకం. అటువంటి వారి మధ్యలో మనకు కనిపించే అరుదైన పర్సనాలిటీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. సమాజంలో ఏ దుర్ఘటన జరిగినా తీవ్రంగా చలించిపోతారు. నిర్భయ ఘటనలోని నిందితులకు ఉరిశిక్ష పడేవరకూ ఒంటి మీద నల్లచొక్కా విప్పనని ఆయన శపథం చేశారు.

అంతేకాక తెలుగు పాఠశాలలను ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమానికి మార్పుచేయడంపై తీవ్రంగా స్పందించారు. మొత్తం తెలుగుజాతినే నిషేధించేయండి అని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి శనివారం నరసాపురం వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ ఇలా సాగింది.

ప్రశ్న : నిర్భయ ఘటనలో చాలా తీవ్రంగా స్పందించారు, మళ్లీ అంత స్పందన చూడలేదు కారణం?
జవాబు : నిజమే. హైదరాబాద్ సాక్షి చానల్ స్టూడియోలో శపథం చేశాను. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడేవరకూ ఆ రోజు వేసుకున్న నల్లాచొక్కా విప్పనని. కానీ ఆ నల్లచొక్కా విప్పిన తరువాత నిర్భయలాంటి ఘటనలు చాలా జరిగాయి. అలాంటి శపథాలు చేస్తే చొక్కాలు జీవితాంతం వేసుకోలేమని అర్థమైంది. అందుకే శపథాలు మానేశా.

ప్ర : అన్యాయాలపై స్పందించకూడదని అనుకున్నారా..?
జ : అలాగేమీకాదు. నా అభిప్రాయంలో సినిమా వాళ్లు నెగిటివ్‌గా చెప్తేనే ఎక్కువమంది ప్రభావితమవుతారు. కాని నాకు చేతనైనంత వరకూ సమాజంలో చెడును రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నా. అది సినిమాల ద్వారా కొంత, రచనల ద్వారా మరికొంత.

ప్ర : ఇటీవల ర్యాగింగ్ అంశంపై గతంలా స్పందించలేదెందుకని?
జ : ముందే చెప్పానుగా... సినిమావాళ్లు స్పందిస్తే గ్లామర్ ప్లేవర్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి రూపుమాపాలి. జనం అందరూ మంచిగా ఆలోచించాలి.

ప్ర : తెలుగుభాష, అభివృద్ధి పరిరక్షణ రాష్ట్రంలో ఎలా ఉంది?
జ : దారుణంగా ఉంది. రెండురోజుల క్రితం రాష్ట్రంలో 3 వేలకు పైగా పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఆ పాఠశాలల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగేది. వ్యంగ్యం అనుకోకుంటే... తెలుగు బోధించే పాఠశాలలను కాదు, తెలుగువాళ్లను, తెలుగుజాతిని నిషేధించేయమనండి. ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం తప్పుకాదు గాని, మాతృభాషను విస్మరించడం అమ్మను చంపేయడమే అవుతుంది.  

ప్ర : తెలుగుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయా?
జ : నిజమే, తెలుగులో ఎంఫిల్ చేసినా ఉద్యోగాలు రాని పరిస్థితి. అయితే మీ నరసాపురానికే చెందిన కడిమెళ్ల వరప్రసాద్ తెలుగును నమ్ముకుని ప్రపంచ గుర్తింపు పొందారు.

ప్ర : మీ డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్న ఎప్పుడు?
జ : 24 ఫ్రేమ్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మాతగా, ఆయన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో భక్తకన్నప్ప నా స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది. జనవరిలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.
 
ప్ర : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
జ : స్టార్ పెద్ద  హీరోలతో రూపుదిద్దుకుంటున్న 12 సినిమాల్లో నటిస్తున్నా. కిట్టూ సినిమాలో పాత తనికెళ్ల భరణిని చూస్తారు.

మరిన్ని వార్తలు