నెల కావస్తున్నా స్పష్టత లేదు..

22 Aug, 2016 03:17 IST|Sakshi
నెల కావస్తున్నా స్పష్టత లేదు..

ఇంకా మిస్టరీగానే తనూజ మృతి కేసు
కేసులో కనీస పురోగతి సాధించలేకపోయిన పోలీసులు


పెందుర్తి(విశాఖపట్నం): అనుమానస్పదంగా మృతి చెందిన కృష్ణరాయపురం బాలిక తనూజ మృతి కేసు అడుగు కూడా ముందుకు పడలేదు. గత నెల 23న అర్ధరాత్రి(24 ఉదయం వెలుగులోకి వచ్చింది) జరిగిన ఈ ఘటనలో పోలీసులు కనీస పురోగతి సాధించలేకపోయారు. గత నెల రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. అనేక ఆధారాలు సేకరించారు. అయినా ఈ కేసులో కనీస పురోగతి లేదు. తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో చివరకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో వారికీ స్పష్టత లేదు.

ఆ అపార్ట్‌మెంట్‌లో ఏం జరిగింది..
కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ(14) పురుషోత్తపురం మహతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడిచుకుని రాకపోకలు సాగిస్తుంది. ఈ క్రమంలో జూలై 23న(శనివారం) సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న తనూజతో ఓ యువకుడు మాట్లాడుతూ వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో అదే రోజు రాత్రి తనూజని మందలించింది. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

అయితే అదే అపార్ట్‌మెంట్‌ కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మతదేహం జూలై 24న(ఆదివారం) ఉదయం కనిపించింది. తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్ళడం వాచ్‌మెన్‌తో పాటు స్థానికులు చూసినట్లు  చెబుతున్నారు. అక్కడకు వెళ్ళిన తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్ళిందా..స్నేహితుడి సన్నిహితుల ప్లాట్‌కు వెళ్ళిందా అన్నది స్పష్టత రావడం లేదు. లేకపోతే తనూజ ఒంటరిగా బయటకు రావడం చూసి అక్కడే పొంచి ఉన్న ఆకతాయిలు ఏమైనా చేశారా అన్నది అంతుచిక్కడం లేదు.. మొత్తానికి ఈ ఘోరం అపార్ట్‌మెంట్‌ వేదికగానే జరిగిందన్నది సుస్పష్టం.

ఫోరెన్సిక్‌ రిపోర్టు రావాలి..విజయ్‌కుమార్, ఎస్‌ఐ
తనూజ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏ క్లూ దొరికినా వదిలిపెట్టం. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఫోరెన్సిక్‌ రిపోర్టు వస్తే విషయం తెలుస్తుంది. మరికొద్దిరోజుల్లో రిపోర్టు రావచ్చు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు