85 వేల టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యం

1 Jun, 2017 00:35 IST|Sakshi
85 వేల టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యం
నంద్యాల అర్బన్‌ : మార్క్‌ఫెడ్‌ల ద్వారా 85 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని మార్క్‌ఫెడ్‌ జీఎం శివకోటిప్రసాద్‌ తెలిపారు. స్థానిక టెక్కె మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ద్వారా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లను బుధవారం మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జీఎం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కడప, నంద్యాల, ఉదయగిరి, దుగ్గిరాళ్ల, వేమూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ల ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు.
 
ఇప్పటి వరకు 15 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసి రూ.94 కోట్లు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామన్నారు. అదే విధంగా మార్క్‌ఫెడ్‌ల ద్వారా 87 వేల టన్నుల కందులను కొనుగోలు చేసి రూ.450 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో మిరప పంటను  కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. నెలాఖరు వరకు పసుపు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల మార్కెట్‌ యార్డుకు పసుపు రైతుల తాకిడి అధికమైందని, మరో ఆరు కాటాలు తెప్పించి పసుపు కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అమ్మకాలు జరిగిన రెండు మూడురోజుల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. సీనియర్‌  ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజర్‌ సంజీవరెడ్డి, నంద్యాల మార్క్‌ఫెడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరాజు, మహేశ్వరరెడ్డి, రవి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు