రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్‌దాడులు

19 Aug, 2016 21:54 IST|Sakshi
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్‌దాడులు
మిర్యాలగూడ అర్బన్‌: రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృదం మిర్యాలగూడలోని ఓ రైస్‌ మిల్లుపై శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. అక్రమంగా నిల్వ చేసిన ధాన్యం బస్తాలను సీజ్‌ చేసింది. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్‌పల్లి రోడ్డులో ఉన్న శ్రీ సాయి పవన్‌ రైస్‌మిల్లులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విశ్వసనీయ సమచారంతో దాడులు నిర్వహించినట్లు రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక అధికారులు జి.విద్యాసాగర్‌రెడ్డి, బి.రాజేషం తెలిపారు. శ్రీ సాయి పవన్‌ రైస్‌మిల్లుకు సీఎంఆర్‌ మిల్లింగ్‌ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం 40 కేజీల బస్తాలను 6 వేలు ఇచ్చిందన్నారు. కానీ ఆ బస్తాల లెక్కలను చూపకుండా బియ్యాన్ని బయటి మార్కెట్‌లో అమ్ముకున్నట్లు దాడుల్లో నిర్ధారించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 5, 2016 నుంచి ఆగస్టు 8వరకు రికార్డులు చూపిన రైస్‌మిల్లు యాజమాన్యం కస్టమ్స్‌ మిల్లింగ్‌ బియ్యం సంబంధించిన రికార్డులను ఏప్రిల్‌ 28వ తేది నుంచి నేటి వరకు ఎలాంటి రికార్డులు నమోదు చేయలేదని చెప్పారు. దీంతో సుమారు రూ.40 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి 6205.95 క్వింటాళ్ల సీఎంఆర్‌ బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. 4590 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.   ప్రభుత్వం అందించిన ధాన్యం నిల్వలు చూపకపోవడంతో మిల్లు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. 20 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా దాచి ఉంచినట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆ ధాన్యం మొత్తాన్ని సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల ప్రకారం బియ్యం సరఫరా చేయని ఈ మిల్లుపై ప్రభుత్వానికి నివేధికను పంపించి అనంతరం యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీజ్‌ చేసిన ధాన్యం బస్తాలకు పంచనామా నిర్వహించి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో సివిల్‌ సప్లై నల్లగొండ, పెద్దవూర, డిప్యూటీ తహసీల్దార్లు సంగమిత్ర, లక్ష్మణ్, పీఆర్‌ఐ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు