టాటావారి కరెంటు ‘షాక్’

10 Apr, 2017 11:41 IST|Sakshi

బస్సు చార్జీలు పెరిగి కొన్ని గంటలైనా కాకముందే ముంబైకర్లకు మరోషాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతున్నట్టు టాటా పవర్ తెలిపింది. వరుసగా మూడేళ్ల టారిఫ్‌ను ప్రకటించింది. దీనికితోడు.. కూరగాయలు, హోటల్ భోజనం ధరలూ పెరిగాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కూరగాయ పంటలు దెబ్బతినడంతో రేట్లు అమాంతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 
 
 సాక్షి ముంబై: నగరవాసులకు మరోషాక్! ముంబైలోని పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా చేసే టాటా పవర్ కంపెనీ విద్యుత్ టారిఫ్‌ను పెంచేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్‌ను 25 శాతం పెంచాలని నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయి. దీంతో టాటా పవర్ కంపెనీకి చెందిన సుమారు మూడు లక్షల మంది నివాస వినియోగదారులకు వచ్చే నెల నుంచి అదనపు భారం తప్పదు. జూలైలో వచ్చే బిల్లులపైనా 25 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సర చార్జీలను కూడా టాటా పవర్ ఇప్పుడే ప్రకటించింది. 2014-15లో సుమారు 15 శాతం, 2015-16లో సుమారు 11 శాతం టారిఫ్ పెరుగుతుంది. ప్రస్తుత, అలాగే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల టారిఫ్ వివరాలు ఇలా ఉన్నాయి.
 
 ఈ సంవత్సరం ప్రతి యూనిట్‌కు రూ.6.35 చొప్పున, 2014-15లో రూ.7.10 చొప్పున, 2015-16లో యూనిట్‌కు రూ.7.89 చొప్పున చెల్లించాలి. మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎంఈఆర్‌సీ) ఆదేశాల మేరకు ఈ టారిఫ్‌ను ప్రకటించారు. టాటా పవర్ కంపెనీ ప్రతిపాదించిన ధరలకు ఎంఈఆర్‌సీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ముంబైలో దాదాపు 50 లక్షల మంది వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు టాటా పవర్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. వీరి నెలవారీ బిల్లులు సుమారు 22 శాతం నుంచి 39 శాతం వరకు పెరగనున్నాయి. 
 
 తిండి ధరలు కూడా..
 భారీ వర్షాల వల్ల ఏర్పడిన కూరగాయల కొరత ప్రభావం హోటల్ వినియోగదారులపైనా పడింది. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో సరుకు కొరత ఏర్పడి కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో హోటళ్ల యజమానులు కూడా ధరలు పెంచేశారు. రోడ్లపై ఉండే కొన్ని ఫలహారశాలల్లో ఇప్పటికీ చౌకధరలకే ఆహారం దొరుకుతోంది. దీంతో చాలా మంది వాటికే మొగ్గుచూపుతున్నారు.  బేరాలు లేక హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కొద్దిరోజులుగా కూరగాయల ధరలు మండిపోతుండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని హోటళ్ల యజమానులు అంటున్నారు. ప్లేట్ భోజనం ధరలను పెంచితే తప్ప నష్టాలను తట్టుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఒక్కో రైస్‌ప్లేట్‌లో కనీసం మూడు లేదా నాలుగు రకాల కూరలను వడ్డించాల్సి ఉంటుంది. వడ, శాండ్‌విచ్, సాబుదాణా వడ, మిసల్, ఇడ్లీ తదితర తినుబండారాల ధరలనూ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. సరుకు కొరత వల్ల అన్ని కూరగాయల ధరలూ పెరిగాయి. కొన్నిచోట్ల చిరువ్యాపారులు కూడా ధరలు పెంచారు. నిన్నమొన్నటి వరకు అతి తక్కువ ధరకు లభించిన కొత్తిమీర కట్టలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, కొబ్బరికాయలు రేట్లు అమాంతం పెరిగాయి. చిన్న హోటళ్లలో ప్రస్తుతం రైస్‌ప్లేట్‌కు రూ.30 నుంచి రూ.40 వరకు, పూరీబాజీకి రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. మధ్యస్థాయి హోటళ్లలో అయితే రైస్‌ప్లేట్ ధర రూ.50కిపైనే ఉంటుంది. స్టార్ హోటళ్లు టోకు ధరలకు కొంటాయి కాబట్టి, వాటిపై ధరల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని చిరు వ్యాపారులు అంటున్నారు.
 
 కొన్ని రోజులుగా  కురుస్తున్న వర్షాలవల్ల చెట్ల మీదున్న, కోసి పక్కన బెట్టిన కూరగాయలు అక్కడే కుళ్లిపోయాయి. దీంతో సరుకు కొరత ఏర్పడి ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కొత్త పంట చేతికి రావాలంటే మరో నెల రోజుల సమయం పట్టవచ్చని రైతులు అంటున్నారు. అంతవరకు ఈ తిప్పలు తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ చార్జీలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కనీస చార్జీని రూ.ఆరుగా ప్రకటించింది. స్టేజీకి రూపాయి చొప్పున పెంచినట్టు తెలిపింది.
 

మరిన్ని వార్తలు