రెండో వాహనం ఉంటే పన్ను మినహాయింపు?

1 Apr, 2016 19:30 IST|Sakshi

ఇప్పటికే వాహనం ఉండి.. మరో వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఇలా రెండో వాహనం కొనుగోలు చేసేవారిపై ప్రస్తుతం విధిస్తున్న అదనపు పన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతం ఒక వాహనం కలిగి ఉన్న వ్యక్తి తన పేరుతోనే రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనపు పన్ను భారం మోయాల్సి వస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో సాధారణంగా వసూలు చేసే జీవిత కాల పన్నుతోపాటు మరో 2 శాతం పన్నును రవాణా శాఖ వసూలు చేస్తోంది.

 

అయితే కొందరు యజమానులు వాహనాలు అమ్మేసినా కొనుగోలుదారులు పేరు మార్పించుకోకపోవడం వల్ల పాత యజమానులే అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరికొందరు అదనపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ముందు జాగ్రత్తగా తొలి వాహనాన్ని కుటుంబ సభ్యుల్లో మరొకరి పేరిట బదిలీ చేయించిన తర్వాత రెండో వాహనం కొనుగోలు చేస్తున్నారు. ఇంకా కొందరు అసలు గతంలో తమకు వాహనం లేదని బుకాయించడం.. అధికారులు ధ్రువీకరించుకోలేక ఇబ్బంది పడటం జరుగుతోంది. దీనిపై పరిష్కారమార్గాలను అన్వేషించిన అధికారులు.. రెండో వాహనం పన్ను ఎత్తివేత సరైందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు