కొరియర్ లో టీసీలు

12 Jun, 2016 02:12 IST|Sakshi

ఫీజు చెల్లించలేదని 22 మంది విద్యార్థులకు ఉద్వాసన
అమృతా విద్యాలయం నిర్వాకం

 హైదరాబాద్ :  ఫీజు చెల్లించలేదన్న కారణంగా నగరంలోని ఓ స్కూల్ 22 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చింది. నేరుగా ఇస్తే తీసుకోరన్న ఉద్దేశంతో కొరియర్ ద్వారా నేరుగా విద్యార్థుల ఇళ్లకు పంపడం గమనార్హం. మహేంద్రహిల్స్‌లోని అమృత విద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఫీజుల నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు అమృత స్కూల్‌లో గెంటివేతకు గురైన విద్యార్థులను తీసుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సదరు పాఠశాలలో గత నాలుగేళ్లుగా ఏటా ఫీజులు పెంచుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఫీజులను తగ్గించాలని పట్టుబట్టినా యాజమాన్యం తిరస్కరించిందన్నారు. వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కాగానే.. ఫీజులు చెల్లించని విద్యార్థులకు కొరియర్‌లో టీసీలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై డీఈఓ, పాఠశాల విద్య కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 అవును.. టీసీలు ఇచ్చాం: ప్రిన్సిపాల్
గతేడాది ఫీజులు చెల్లించని 22 మంది విద్యార్దులకు టీసీలను పోస్టు ద్వారా పంపించినట్లు అమృత విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీకుమారి అగీకరించారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ముగిసిన తరువాత వారికి ఫలితాలు వెల్లడించి టీసీలు ఇచ్చామన్నారు. నగరంలో అన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలోకెల్లా తామే తక్కువ ఫీజు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణలు సరికాదని, తమ స్కూల్‌కు సంబంధించిన ప్రతి రికార్డు డీఈఓ కార్యాలయంలో ఉందన్నారు.

మరిన్ని వార్తలు