మోత్కుపల్లిపై పార్టీ శ్రేణుల ఆరోపణలు

13 Dec, 2015 00:00 IST|Sakshi
మోత్కుపల్లిపై పార్టీ శ్రేణుల ఆరోపణలు

అసలే అంపశయ్యపై ఉన్న తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకాస్త కుదిపేశాయి. అన్ని జిల్లాల్లాగే నల్లగొండలోనూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని, 'కారు' ఎక్కడంతో.. అరకొరగా ఉన్న పార్టీ వీరవిధేయుల్లో ఆందోళన చెలరేగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావు నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం.. పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు తెలిసే జరిగిందని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలతో మోత్కుపల్లి టచ్‌లో ఉన్నారని, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరింపజేశారని ఈ మేరకు లక్షల రూపాయల సొమ్ముకూడా తీసుకున్నారని ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోటీ ఉపసంహరణ విషయం కనీసం పార్టీలో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

టీడీపీ అభ్యర్థి వెనుకడుగుతో నల్లగొండ ఎమ్మెల్సీ బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి తేరా చిన్నపురెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్‌గౌడ్, ఎంపీపీల ఫోరం నుంచి మిట్ట పురుషోత్తం రెడ్డి బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే నెలకొననుంది.

కాగా, తిరుగుబాటుదారులను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తిరుమలగిరి ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న మిట్ట పురుషోత్తంరెడ్డిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పీసీసీ కార్యదర్శిగా ఉన్న సుంకరి మల్లేశ్‌గౌడ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డికి డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ సిఫారసు చేశారు. మల్లేశ్‌గౌడ్ బహిష్కరణ అంశాన్ని పీసీసీ తేల్చాల్సి ఉంది.

మరిన్ని వార్తలు