టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

29 Oct, 2015 01:45 IST|Sakshi
టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది

♦ ‘హోదా’పై అవగాహన కల్పించడంలో సీఎం, మంత్రులు విఫలం
♦ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం
 
 సాంబమూర్తినగర్ (కాకినాడ): రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. బుధవారం కాకినాడలో విలేకరుల తో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేస్తుండగా సీఎం చంద్రబాబు అవన్నీ తామే చేసినట్లు చెప్పుకోవడం బాధాకరమన్నారు. చిన్నారులకు టీకాలు అందించే ‘మిషన్ ఇంద్ర ధనుష్’ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానికి సముచిత స్థానం ఇవ్వకపోవడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తామే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవాలని సంకల్పించామని, ఇందుకు మీడియా సహకరించాలని వీర్రాజు కోరారు.

 ‘హోదా’పై అవగాహన కల్పించడంలో విఫలం..
 ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలని, ఏ ఒక్క ప్రాంతానికీ పరిమితం కారాదని అభిప్రాయపడ్డారు.ఇటీవల ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. మోదీ ప్రభుత్వం నూతన రాష్ట్రమైన ఏపీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం రూ.24 వేల కోట్లతో ఎన్‌టీపీసీ ద్వారా విశాఖలో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో రూ.6వేల కోట్లతో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపడుతోందన్నారు.
 
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీర్రాజు!
 సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక దాదాపు ఖాయమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు, నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ కోసం చురుకుగా పనిచేసిన వీర్రాజు అభ్యర్థిత్వాన్ని నేతలు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వీర్రాజు పేరును  ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు